రాజకీయ ప్రయోజనాల కోసం పారిశ్రామికవేత్తలపై దాడి చేయడం సరైంది కాదన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యాలు రాజకీయంగా సంచలనం అయ్యాయి. అదానీ విషయంలో ప్రతిపక్షాల దూకుడును కొట్టిపారేసిన శరద్ పవార్ వ్యాఖ్య మహారాష్ట్ర రాజకీయ వ్యవస్థలో చిచ్చు రేపింది. పవార్ వ్యాఖ్యాలపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందించారు.
అదానీ అంశంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్య ప్రతిపక్షాల ఐక్యతలో ఎలాంటి విభేదాలను సూచించదని ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. పవార్ చేసిన ప్రకటన మహారాష్ట్రలో ప్రతిపక్షాల ఐక్యతపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. భావసారూప్యత ఉన్నవారు బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా ఉంటారని సంజయ్ రౌత్ అన్నారు. శరద్ పవార్ తమకు చాలా కాలంగా తెలుసు అని, గౌతమ్ అదానీపై మొదటి నుండి పవార్ స్పందన చూస్తున్నామన్నారు. ప్రతిపక్షాల ఐక్యతలో విభేదాలు ఉన్నాయని దీని అర్థం కాదన్నారు. జేపీసీ విచారణ జరగాలా లేక సుప్రీంకోర్టు విచారణ చేయాలా అనే అంశంపై పవార్ కు భిన్నమైన అభిప్రాయం ఉండవచ్చు, కానీ మొత్తం విపక్షాలు నిలబడిన చోట శివసేన నిలబడుతుందని రౌత్ అన్నారు. ఎన్సీపీ అధినేత ప్రతిపక్ష నేతల్లో ఒకరిగా ఉంటారని, ప్రజాస్వామ్యంలో సమస్యలపై తనదైన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఆయనకు ఉందని సంజయ్ రౌత్ అన్నారు.
Also Read:Emine Dzhaparova: భారత్‌ను సందర్శించనున్న ఉక్రెయిన్ మంత్రి.. యుద్ధం తర్వాత తొలి అధికారిక పర్యటన
మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కాంగ్రెస్ , ఉద్ధవ్ ఠాక్రేలపై విరుచుకుపడ్డారు. పవార్ మాటలను ప్రతిపక్షాలు పట్టించుకోవాలని అన్నారు.అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం సమంజసం కాదని శరద్ పవార్ ప్రకటన రుజువు చేసిందని ఆయన చెప్పారు.
ఈ వివాదంపై శివసేన (షిండే వర్గం) అధికార ప్రతినిధి కృష్ణ హెగ్డే మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఐక్యత లేదని మేము మొదటి నుండి చెబుతున్నామని, ఇప్పుడు శరద్ పవార్ చేసిన ప్రకటనతో రుజువు అయిందని తెలిపారు. విపక్షాల డిమాండ్‌కు ఎన్సీపీ అధినేత మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారని చెప్పారు.
Also Read:Bearded Woman : బామ్మా మజాకా ! నీ గడ్డం మీసం అదుర్స్
మరోవైపు శరద్ పవార్ వ్యాఖ్యపై బిజెపి కూడా స్పందించింది. కాంగ్రెస్ మిత్రపక్షాలు రాహుల్ గాంధీ యొక్క మతిభ్రమించిన ఆలోచనలను ఒక్కొక్కటిగా తిరస్కరిస్తున్నాయి అని పేర్కొంది. కాగా, అదానీ గ్రూప్‌పై పార్లమెంటరీ విచారణ కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాల డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.