సుప్రీమ్ హీరో సాయి తేజ్ తాజా చిత్రం ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 22న ఈ సినిమా తాజా ప్రచార చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొనబోతున్నట్టు అధికారిక సమాచారం. మేనల్లుడు సాయితేజ్ అంటే పవన్ కళ్యాణ్ కు అంతులేని అభిమానం. అతన్ని ‘రేయ్’ సినిమాతో హీరోగా పరిచయం చేయాలని పవన్ కళ్యాణ్ తపించారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ‘రేయ్’ సినిమా మొదట ప్రారంభమైనా, జనం ముందుకు మాత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’ మూవీ వచ్చింది.
ఆ మధ్య సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలియగానే, పవన్ కళ్యాణ్ హుటాహుటిన హాస్పిటల్ కు వెళ్ళి చూసి వచ్చాడు. ఇప్పుడు సాయితేజ్ నిదానంగా కోలుకుంటున్నా, ‘రిపబ్లిక్’ మూవీ పబ్లిసిటీలో పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. దాంతో మెగా ఫ్యామిలీ హీరోలంతా అతనికి బాసటగా నిలిచి, ఈ మూవీ ప్రమోషన్ ను భుజానకెత్తుకుంటున్నారు. గత యేడాది సాయితేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల సమయంలో కూడా తెలుగు సినిమా రంగానికి చెందని హీరోలంతా సంఘీభావం ప్రకటించారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత జనం ముందుకు వచ్చిన తొలి చిత్రం అదే కావడంతో… దాన్ని ఆదరించమంటూ ప్రజలను కోరారు. ఇప్పుడు సాయితేజ్ ఉన్న పరిస్థితి దృష్ట్యా ‘రిపబ్లిక్’ విషయంలోనూ అదే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఈ సానుభూతి పవనాలు ‘రిపబ్లిక్’ సక్సెస్ కు ఏ మేరకు ఉపయోగపడతాయో చూడాలి. అన్నట్టు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 25న జరుగబోతోంది.