వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రతీ జబ్బుకు చికిత్స అందుబాటులో ఉన్నది. అవయావాల మార్పిడి కూడా వేగంగా జరుగుతున్నది. అవయవదానం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అవయవాల కొరత వేధిస్తున్నది. మనిషికి అత్యవసరంగా అవయవ మార్పిడి చేయాల్సి వచ్చినపుడు దానికి ప్రత్యామ్నాయం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. జంతువుల అవయవాలను మనిషికి అమర్చే అంశంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా న్యూయార్క్‌కు చెందిన పరిశోధకులు వినూత్న ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోన్ హెల్త్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు బ్రెయిన్ డెడ్ అయిన ఓ రోగికి పంది కిడ్నీని అమర్చారు. మూడు రోజులపాటు బ్రెయిన్ డెడ్ అయిన రోగి శరీరంలో పంది కిడ్నీ సాధారణంగా పనిచేసింది. రోగ నిరోధక శక్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని వైద్యనిపుణులు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో కిడ్నీ బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.