(జూన్ 24తో ‘ఊరికిచ్చిన మాట’ 40 ఏళ్ళు పూర్తి)
నలభై ఏళ్ళ క్రితం చిరంజీవి ఇంకా వర్ధమాన కథానాయకునిగా రాణిస్తున్న రోజుల్లో నటునిగా ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టిన చిత్రం ‘ఊరికిచ్చిన మాట’. ప్రముఖ నటుడు యమ్.బాలయ్య సమర్పణలో అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన చిత్రమిది. 1981 జూన్ 24న విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి, సుధాకర్ అన్నదమ్ములుగా నటించారు.
‘ఊరికిచ్చిన మాట’ కథ విషయానికి వస్తే – ఓ మారుమూల పల్లెటూల్లో ఇద్దరు అన్నదమ్ములు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తమ్ముడు బాగా చదవాలని అన్నయ్య కష్టపడి చదివిస్తూ ఉంటాడు. తమ ఊరిలో డాక్టర్లు లేనందున తమ్ముణ్ణి డాక్టర్ చేసి, ఊళ్ళో వారికి సేవ చేయించాలని ఆశిస్తాడు అన్న. అతని మంచితనం చూసి, ఊళ్ళోవాళ్ళు అతని తమ్ముణ్ణి చదివించడానికి తమ కష్టార్జితం నెలనెలా పంపిస్తూ ఉంటారు. అయితే తమ్ముడు చదువుకున్న తరువాత పెద్దింటి అమ్మాయిని ప్రేమించి పెళ్ళాడి, పట్నంలో మకాం పెడతాడు. ఊరికిచ్చిన మాట తప్పుతాడు. తమ్ముడి భార్యను ఊరికి ఎత్తుకెళ్తాడు అన్నయ్య. తమ్ముడు వచ్చి ప్రాణాపాయస్థితిలో చిక్కుకుంటాడు. అతని ప్రాణం కాపాడటానికి అన్నయ్య ఏడు మైళ్ళు వెళ్ళి డాక్టర్ ను తీసుకు వస్తాడు. ఈ లోగా తమ్ముడి మామ పోలీసులను వెంటపెట్టుకు వస్తాడు. అన్నయ్యను అరెస్ట్ చేయించాలనుకుంటాడు. అయితే తననెవరూ ఎత్తుకు రాలేదని తమ్ముని భార్య చెబుతుంది. చివరకు ఆ భార్యాభర్తలిద్దరూ ఆ పల్లెలోనే ఉండి, ఆ ఊరికిచ్చిన మాట నిలబెడతారు.
ఈ చిత్రంలో చిరంజీవి జోడీగా కవిత, సుధాకర్ జంటగా మాధవి నటించారు. మిగిలిన పాత్రల్లో కాంతారావు, గిరిబాబు, రావి కొండలరావు, మాడా, నారాయణరావు, వంకాయల, ఝాన్సీ, లక్ష్మీకాంతమ్మ, శ్రీలక్ష్మి, శ్రీవిజయ, జయమాలిని తదితరులు కనిపించారు. ఈ చిత్రానికి డి.వి.నరసరాజు మాటలు రాశారు. సినారె, జాలాది పాటలు పలికించారు. ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చారు. అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట్రావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ ప్లే కూడా బాలయ్య నిర్వహించారు.
ఇందులోని “పైరగాలి పైట లాగుతుంటే…” , “అదిరింది ఊరు…”, “చూపుల్లో చుట్టేసి…మాటల్లో పట్టేసి… చేతుల్లో కట్టేసినావే…” , “పాడింది ఊరు…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి. అంతకు ముందు వచ్చి, సూపర్ హిట్ గా నిలచిన ‘ఊరుకి మొనగాడు’ టైటిల్ లో వ్యాకరణ దోషంలాగే ఈ సినిమా టైటిల్ లోనూ ‘ఊరుకిచ్చిన మాట’ అని పడుతుంది. ఏమయినా ఇందులోని కథాంశం బి,సి క్లాస్ సెంటర్స్ జనాన్ని ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ తృతీయ చిత్రంగా నంది అవార్డు లభించింది.