ఏపీ టెకెట్ల ధరలపై రచ్చ జరుగుతూనే ఉంది. గత మూడు రోజులుగా ఏపీలోని సినిమా థియేటర్లపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి సరైన పత్రాలు లేని సినిమా హాల్‌లను మూసివేస్తున్నారు. అయితే విశాఖపట్నం జిల్లాలోని సినిమా థియేటర్లను కూడా నిన్నటి నుంచి తనిఖీ చేస్తున్నారు. ఈ రోజు కూడా జిల్లాలోని సినిమా థియేటర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నగరంలోని జగదాంబ, మెలోడీ థియేటర్ లలో ఆర్డీవో తో కలిసి జిల్లా కలెక్టర్ స్వయంగా తనిఖీలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో టికెట్ రేట్స్ పై ప్రేక్షకులను కలెక్టర్ అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా థియేటర్‌లోని ఫుడ్ ధరలపై ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 115 థియేటర్లు ఉన్నాయని, అందులో ఇప్పటికే 70 థియేటర్లలో తనిఖీలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ రోజు మిగతా థియేటర్స్‌ను అధికారులుతో కలిపి తనిఖీ లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు పాటించని థియేటర్లపై, లైసెన్స్ లు రెన్యువల్ చేయని థియేటర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.