2021 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఇద్దరు పాత్రికేయులను వరించింది.. ఈ ఏడాది ఫిలిప్పైన్స్‌కు చెందిన మారియా రెస్సా, రష్యాకు చెందిన దిమిత్రీ మురటోవ్ అనే జర్నలిస్టులు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం వీరు ధైర్యంగా పోరాడుతున్నారని ప్రశంసలు కురిపించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ… అందుకే వీరిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది.
జర్నలిస్టు మరియా రెసా.. ఫిలిప్పీన్స్‌లో క్రమంగా పెరిగిపోతున్న అధికార దుర్వినియోగం, హింసను తన కలంతో ప్రపంచానికి తెలియజేశారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం 2012లో ఆమె ‘రాప్లర్’ పేరుతో ఓ డిజిటల్ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ జర్నలిస్టుగా, రాప్లర్ సీఈవోగా రెసా.. ఎన్నో సంచలనాత్మక కథనాలను ప్రచురించి ధైర్యంగా నిలిచారు.. ఇక, ఆమెకు ఎన్నో బెదిరింపులు, ఒత్తిళ్లు తప్పలేదు.. అయినా, వాటిని లెక్కచేయకుండా భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. మరోఐపు.. రష్యాకు చెందిన జర్నలిస్టు దిమిత్రి మురాటోవ్ మీడియా స్వేచ్ఛ కోసం సుదీర్ఘ పోరాటం చేస్తూ వస్తున్నారు. ప్రముఖ వార్తా పత్రిక నొవాజా గజెటా వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన.. 24 సంవత్సరాల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా సేవలు అందించారు.. దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు.. ఈ నేపథ్యంలో.. నోబెల్ కమిటీ.. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పుసర్కారానికి ఈ ఏడాది ఆ ఇద్దరినీ ఎంపిక చేసింది.