ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించరు. ఉదయం 8.30 గంటలనుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఈ రోజు ఫస్ట్ ఇయర్ పరీక్షులు జరుగుతున్నాయి. గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు కచ్ఛితంగా హాల్ టిక్కెట్లను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లాలి. పరీక్షలకు సంబంధించిన సమస్యలపై ఇంటర్ విద్యామండలి టోల్‌ఫ్రీ నంబరు 18004257635 ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో 1,489 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 10,03,990మంది పరీక్షలు రాస్తున్నారు. ఫస్ట్ ఇయర్ 4,84,197 మంది, సెకండ్ ఇయర్ 5,19,793 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. అన్ని కేంద్రాల్లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.
అయితే, నిమిషం నిబంధనను ఇంటర్ అధికారులు అమలు పరచడం వల్ల విద్యార్థులకు టెన్షన్ కు గురవుతున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదంటూ పరీక్షల నిర్వహణ సందర్భంగా విధిస్తున్న ఈ నిబంధన విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారుతోంది. పరీక్షలకు ఎలాంటి ఒత్తిడి లేకుండా రాయలంటూ అధికారులు చెబుతున్నా.. నిమిషం నిబంధనతో విద్యార్థలు అధిక ఒత్తిడికి గురవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో నిమిషం నిబంధనతో చాలా మంది పరీక్షలకు దూరమయ్యారు. ఒక్క నిమిషం నిబంధన విద్యార్థుల్లో కొంత ఆందోళన నెలకొల్పింది. గంట ముందుగానే కేంద్రాల వద్ద విద్యార్థులు బారులు తీరారు. చివరి సమయంలో వచ్చిన కొంత మంది పరుగులు తీశారు. ఈ క్రమంలో కొందరు ఆలస్యంగా రావటం వల్ల నిర్వాహకులు అనుమతించలేదు. ఎంత బతిమాలినా పంపించకపోవటం వల్ల కన్నీటి పర్యంతమైన సందర్భాలు ఉన్నాయి.