పాట్నా పేలుళ్ల కేసులో సంచలన తీర్పు వెలువరించింది ఎన్‌ఐఏ కోర్టు.. 2013 పాట్నాలోని గాంధీ మైదాన్‌లో వరుస బాంబు పేలుళ్ల కేసులో ఆరుగురు మరణించగా, 80 మంది గాయపడ్డారు.. ఈ కేసులో 10 మంది నిందితుల్లో తొమ్మిది మందిని ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు అక్టోబర్ 27న దోషులుగా నిర్ధారించింది. ఇక, ఇవాళ వారికి శిక్షలు ఖరారు చేసింది.. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించగా, ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష, మిగిలన మరో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు..
కాగా, 2013లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించిన సందర్భంగా పాట్నాలోని గాంధీ మైదానంలో ‘హుంకార్’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు.. అయితే, ర్యాలీ ప్రారంభానికి ముందే ఆ ప్రాంతం బాంబు పేలుళ్లతో దద్దరిలింది.. సభా ప్రాంగణంలో మొత్తం ఆరు బాంబు పేలుళ్లు జరిగాయి.. రెండు బాంబులు మోడీ ప్రసంగ వేదికకు అతి సమీపంలోనే పేలాయి.. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ కేసులో దాదాపు 8 ఏళ్ల పాటు దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ.. కోర్టుకు చార్జిషీట్ సమర్పించింది. 10 మందిని నిందితులుగా పేర్కొంది. విచారణ చేపట్టిన న్యాయస్థానం తొమ్మిది మందిని దోషులుగా తేల్చింది. సరైన సాక్ష్యాదారాలు లేకపోవడంతో ఓ నిందితుడిని నిర్ధోషిగా ప్రకటించింది. ఇక, ఇవాళ శిక్షలు ఖరారు చేసింది.