టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య హైఓల్డేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. రెండు దేశాల్లోనూ భావోద్వేగాలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే దాయాదితో మ్యాచ్ పై రాజకీయ మేఘాలు ముసురుకుంటున్నాయి. కశ్మీర్లో మనుషుల్ని చంపుతున్న పాకిస్తాన్ తో క్రికెట్ ఏంటనే వాదన తెరపైకి వచ్చింది. అయితే క్రీడల్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని మరో వర్గం వాదిస్తోంది. మ్యాచ్ ఆడకపోతే భారత్ కు లాభమా.. నష్టమా..? దాయాదుల మధ్య పోరుకు క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది..? బీసీసీఐకి బిజినెస్సే ముఖ్యమా..?
అక్టోబర్ 24న దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్.. ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ లో తలపడుతున్నాయి. రెండు జట్లకీ మెగా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో.. కశ్మీర్లో ఉగ్రదాడులకు కారణమైన దాయాదితో క్రికెట్ బ్యాన్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనాధన్ టోర్నీ టీ -20 వరల్డ్ కప్ ప్రారంభం అయింది. అక్టోబర్ 17 నుంచి క్వాలిఫైయిర్స్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇక, అక్టోబర్ 23న అసలు సమరం.. సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. అక్టోబర్ 24న దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ టోర్నీకే హైలైట్ గా నిలవనుంది. ఈ ధనా ధన్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఇక, దాయాది దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల ఎఫెక్ట్ తో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయ్. ఇక టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ ఐదుసార్లు ఆడింది. అందులో భారత్ నాలుగు గెలుపొందింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.
దాయాది దేశాల మధ్య దాదాపు రెండేళ్ల తర్వాత మ్యాచ్ జరుగుతుండడంతో ఈ మ్యాచ్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు బుకింగ్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయ్. అయితే, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ పై నీలీనీడలు కమ్ముకునేలా ఉన్నాయ్. లేటెస్ట్ గా శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రభావం టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై తీవ్రంగా పడే అవకాశం కనిపిస్తోంది. గత 24 గంటల్లో దాదాపు శ్రీనగర్ ప్రాంతంలో దాదాపు 9 ఎన్‌కౌంటర్లు జరగగా, ఇందులో 13 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టాయి భద్రతాబలగాలు. తీవ్రవాదుల దాడుల్లో ఓ పానీపూరీ వ్యాపారితో పాటు మరికొందరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
వరుస ఘటనల తరుణంలో సోషల్ మీడియాలో భారత్, పాక్ మ్యాచ్‌ను రద్దు చేయాలని భారీ సంఖ్యలో డిమాండ్లు చేస్తూ, banpakcricket హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. పాకిస్తాన్ తీవ్రవాదులు, భారత్‌పై దాడులు చేస్తూ, ఇక్కడి వారి ప్రాణాలు తీస్తుంటే, మీరు వారితో క్రికెట్ ఎలా ఆడతారంటూ కామెంట్లు చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకపోతే మహా అయితే రెండు పాయింట్లు కోల్పోతామని, భారత ప్రజల ప్రాణాల కంటే అవేమీ ఎక్కువ కావంటూ పోస్టులు పెడుతున్నారు.
పాక్‌తో మ్యాచులు రద్దు చేసుకోవడంతో పాటు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, టెర్రరిజం పెంచుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై బ్యాన్ విధించాలంటూ ఐసీసీకి డిమాండ్ చేస్తున్నారు. అయితే మరికొందరు క్రికెట్ అభిమానులు మాత్రం పాకిస్తాన్ తో మ్యాచ్‌ను రద్దు చేసుకోవడం కంటే, వారిని చిత్తుగా ఓడించి.. ఈ హింసాత్మక చర్యలకు ప్రతీకారం తీర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్లు కసిగా ఆడి దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
భారత్, పాక్ సంబంధాలు దెబ్బతినడం, ఇటీవల జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాద తదితర ఘటనలను ఉదహరిస్తూ ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీనికి మద్దతిచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. ప్రతిపక్ష నాయకులతో పాటు, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన చాలా మంది నాయకులు కూడా పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడకూడదని వాదిస్తున్నారు. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇక, దాయాది దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయి.
అయితే బీసీసీఐ మాత్రం రాజకీయాలకు, క్రికెట్ కు ముడిపెట్టొద్దని విజ్ఞప్తి చేస్తోంది. ఐసీసీ టోర్నీల్లో పాక్ తో ఆడతామని ఇప్పటికే కమిట్ మెంట్ ఇచ్చిన సంగతి గుర్తుచేస్తోంది. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకుండా ఉండటం కుదరదని తేల్చిచెప్పేసింది.
బీసీసీఐ వాదనను సమర్థించేవారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. గతంలో పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్న సమయంలోనూ క్రికెట్ మ్యాచ్ లు ఆగలేదని కొంతమంది గుర్తుచేస్తున్నారు. కేవలం క్రికెట్ బ్యాన్ చేసినంత మాత్రాన ఒరిగేదేముందనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. యుద్ధంలో అయినా.. క్రీడా మైదానంలో అయినా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా మ్యాచ్ జరగాలనే కోరుకుంటోంది. తమ టీమ్ ఈసారైనా గెలిస్తే.. చూడాలని ఉందని ఆ దేశ మాజీలు కూడా కోరుకుంటున్నారు.
ఉగ్రవాద సంఘటనల కారణంగా టీమిండియా పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరిస్తే భారత్‌కు సమస్యలు పెరుగుతాయి. టీమిండియాకు అతిపెద్ద నష్టం ఎదురుకానుంది. మ్యాచ్ ఆడకుండానే పాకిస్థాన్ రెండు పాయింట్లు పొందుతుంది. అదే సమయంలో భారతదేశానికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వరు. ఇది పాకిస్థాన్ సెమీ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను పెంచుతుంది. అదే సమయంలో, సెమీ ఫైనల్స్, ఫైనల్‌కు చేరుకోవడం భారత్‌కు కష్టంగా మారుతుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021లో పాకిస్తాన్‌తో ఆడటానికి భారత్ నిరాకరించింది. పాకిస్తాన్ కూడా దీని గురించి అనేక సార్లు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే బిసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సిరీస్ జరగడానికి అనుమతించలేదు.
భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లేకపోతే ఈసారి ఐసీసీ దీనిని అనుమతించదు. దీనికి ప్రధాన కారణం దాని ఆర్థిక ప్రయోజనాలు. అదే సమయంలో, టీమిండియా ఆడకపోవడంపై పాకిస్థాన్ ఐసీసీకి నిరంతరం ఫిర్యాదు చేస్తోంది. అటువంటి పరిస్థితిలో టీ 20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ ఆడటానికి టీమిండియా నిరాకరిస్తే, ఐసీసీ కూడా భారత జట్టుపై నిషేధం విధించవచ్చు. దీనితో పాటు, టీమిండియా కూడా భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 24 న జరిగే మ్యాచ్‌లో భారత జట్టు ఆడేందుకు నిరాకరిస్తే, అటువంటి పరిస్థితిలో టీమిండియాకు 2 పాయింట్లు రావు. కానీ, మిగతా అన్ని మ్యాచ్‌లలో బాగా ఆడి, ఫైనల్‌కు వెళ్లినా.. అక్కడ పాకిస్తాన్‌తో తలపడితే అవకాశం వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని మరికొంతమంది అడుగుతున్నారు.
సూపర్ 12 స్టేజ్‌లో ఆడలేదు కాబట్టి, ఫైనల్లో కూడా ఆడకూడదు. అప్పుడు వరల్డ్ కప్ ట్రోఫీ పాకిస్తాన్ కి చెందుతుంది. అదే సమయంలో, ఆడకుండానే పాకిస్థాన్‌ని భారత్ విజేతగా చేస్తుంది. దీంతో పాకిస్తాన్‌కు భారత్ ప్రయోజనం చేకూర్చినట్లే అవుతోంది.
చివరిసారిగా ప్రపంచకప్ -2019 లో భారత్-పాకిస్తాన్ కలిశాయి. ఆ సమయంలో కూడా మ్యాచ్‌ను రద్దు చేయాలనే డిమాండ్లు వినిపించాయి. కానీ ఆ మ్యాచులో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 2008 లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, టీమిండియా పాకిస్తాన్‌లో పర్యటించలేదు. ఈ రెండు జట్ల మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ 2012 లో జరిగింది.
జమ్ముకశ్మీర్లో ఇటీవలి పెరిగిపోయిన ఉగ్రదాడులు.. టీట్వంటీ మ్యాచ్ పై నీలినీడలు ముసురుకునేలా చేశాయి. రెండేళ్లుగా ప్రశాంతంగా ఉన్న కశ్మీర్లో ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. స్థానికేతరులే లక్ష్యంగా జరుగుతున్న దాడులతో.. లోయ నుంచి వలస కూలీలు స్వస్థలాలకు పయనమౌతున్నాయి.
జమ్మూకశ్మీర్‌లో స్థానికేతరులను ఉగ్రవాదుల భయం వెంటాడుతోంది. ఎప్పుడు, ఎక్కడ ఉగ్రవాదులు తమను చంపేస్తారేమోనని వలసదారులు దినదిన గండంగా బతుకుతున్నారు. గత రెండు వారాల్లోనే 11 మంది వలసదారులను ముష్కరులు కాల్చి చంపేశారు. దీంతో చాలా మంది ఇప్పటికే ప్రాణభయంతో స్వస్థలాలకు తిరుగు పయనం అవుతున్నారు.కొన్ని వందల మంది వలస కార్మికులు స్వస్థలాల బాట పట్టారు. గత కొద్ది వారాల్లోనే కశ్మీర్ భయానకంగా మారిందని, రోజూ నరకం చూస్తున్నామని వారు వాపోతున్నారు. తమ భార్య, పిల్లలతో కలిసి రాత్రికిరాత్రే పుల్వామా తదితర జిల్లాలను వదిలి జమ్మూ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.
అక్టోబర్ 24 న టీ 20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. అయితే అంతకు ముందు మ్యాచ్ రద్దు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో కాశ్మీరీయేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడమే దీనికి కారణం. పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదుల వ్యూహం మార్పు కారణంగా, కాశ్మీర్‌లో తీవ్రవాద సంఘటనలు పెరిగాయి.
ఉగ్రవాదులు కాశ్మీరీయేతరులను లక్ష్యంగా చేసుకుని వారిని చంపేస్తున్నారు. అయితే, ఆర్మీ సైనికులు కూడా ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇస్తున్నారు. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ తన చేష్టల నుంచి వైదొలగే వరకు, భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు ఉండకూడదని, టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ కూడా రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇటీవలి సంవత్సరాలలో కశ్మీర్‌లో అక్టోబర్ మాసం ఎప్పుడూ ఇంత రక్తసిక్తం కాలేదు. జీవనోపాధి కోసం వలస వచ్చిన కార్మికులను మిలిటెంట్లు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఉపాధ్యాయుల దగ్గర నుంచి, కాయకష్టం చేసుకునే దాకా వారి అందరూ మృతులలో ఉన్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ సందర్భంగా అనేకమంది ఉన్నత స్థాయి మిలిటెంట్ నాయకులు ఎన్‌కౌంటర్లలో మరణించారు. గత వారం జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో తొమ్మిది మంది సైనికులు మరణించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. పూంచ్, రాజౌరీల మధ్య ఉన్న అటవీప్రాంతంలో పెద్ద సంఖ్యలో టెర్రరిస్టులు స్థావరం ఏర్పాటు చేసుకుని ఉన్నారని, వారిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెడుతున్నామని సైనికాధికారులు చెబుతున్నారు.
ఒకవైపు కశ్మీర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా, దాని ఆధారంగా తక్కిన దేశంలో జరుగుతున్న చర్చలు, ముందుకు వస్తున్న ప్రతిపాదనలు మరింత కలవరం కలిగించేవిగా ఉన్నాయి. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరుతో జరుగుతున్న దాడులన్నీ స్థానిక మిలిటెంట్లు చేస్తున్నవేనని, వారు గత రెండు సంవత్సరాల కాలంలో తీవ్రవాద భావాలకు ఆకర్షితులైనవారేనని ఓ వర్గం వాదిస్తోంది. కశ్మీర్‌లో జరుగుతున్నదానికీ అఫ్ఘానిస్థాన్ పరిణామాలకు ముడిపెట్టడం, పాకిస్థాన్ ప్రేరేపిత చర్యలేనని ఆరోపించడం మరో వర్గం చేస్తోంది.
కశ్మీర్లో రేగిన అశాంతి ప్రభావం దేశమంతా కనిపిస్తోంది. మరోసారి భావోద్వేగాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు దాయాదితో యుద్ధం చేయకపోయినా.. కశ్మీర్లో జరుగుతున్నది పరోక్ష యుద్ధమే అనేవారు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. పాకిస్తాన్, భారత్ మధ్య క్రికెట్ కాల పరీక్షకు తట్టుకుని నిలబడింది. గతంలోనూ చాలాసార్లు క్రికెట్ ముఖ్యమా.. దేశం ముఖ్యమా అనే వాదన తెరపైకి వచ్చింది. వచ్చిన ప్రతిసారీ దేశం ముఖ్యమే కానీ.. దేశభక్తిని క్రికెట్ తో ముడిపెట్టొద్దని బీసీసీఐ సమాధానం చెబుతూ వచ్చింది. పైగా పాక్ వైఖరికి నిరసనగానే ద్వైపాక్షిక సిరీస్ లు నిలిపేసిన సంగతిని గుర్తుచేస్తోంది. ఇప్పుడు కూడా అదే వాదన వినిపిస్తోంది.
రెండు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలకు దోహదం చేసే కళలు, సంస్కృతి, క్రీడల్ని.. రాజకీయాలతో ముడిపెట్టొద్దనే వాదన కూడా వినిపిస్తోంది. బాలీవుడ్ సినిమాలు పాకిస్తాన్లో ఆడి కోట్లు సంపాదిస్తుంటే ఎవరూ వద్దనడం లేదని, అలాంటప్పుడు క్రికెట్ కు మాత్రం అభ్యంతరం ఎందుకని అడిగేవాళ్లూ ఉన్నారు. పైగా ఇక్కడ మ్యాచ్ పాక్ గడ్డమీద జరగడం లేదు. ఎక్కడో మూడో దేశంలో జరిగే మ్యాచ్ గురించి.. ఇంత రాద్ధాంతం చేయాల్సిన పనిలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎవరేం మాట్లాడుతున్నా బీసీసీఐ ఎప్పుడూ బిజినెస్ మీదే దృష్టి పెడుతుంది. తన ఒప్పందాలు, స్పాన్లర్ల ప్రయోజనాలు, ఐసీసీకి ఇచ్చిన కమిట్ మెంట్లు.. వీటి గురించే ఆలోచిస్తుంది. గతంలో కూడా చాలాసార్లు పాక్ తో క్రికెట్ పై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన చరిత్ర కూడా బీసీసీఐకి ఉంది. అంతమాత్రాన బీసీసీఐకి దేశభక్తి లేదని ఎలా అంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
భారత్, పాక్ మ్యాచ్ జరగాలా.. వద్దా అనేది ప్రభుత్వాలు నిర్ణయించే స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు రెండు దేశాల బోర్డులు, ఐసీసీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ స్థాయిలో ఆల్ రెడీ బిజినెస్ జరిగిపోయింది. ఇప్పుడు మ్యాచ్ రద్దు చేస్తే.. భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
క్రికెట్ అన్ని దేశాలు ఆడుతుంటాయి. కానీ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఒక రేంజ్ ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లను ఐసీసీ అక్టోబర్ 4 నుంచి ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచింది. అయితే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు గంటలోపే పూర్తిగా అమ్ముడయ్యాయంటే ఈ మ్యాచ్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ క్రేజ్‌ను గ్లోబల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కూడా క్యాష్ చేసుకుంటోంది. వరల్డ్ కప్‌లో ఒక మ్యాచ్‌లో 10 సెకెన్ల యాడ్ రేటు రూ. 12 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకు వసూలు చేస్తోంది. ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్‌కు మాత్రం వేరే రేట్లు ఫిక్స్ చేసింది. ఈ మ్యాచ్ సమయంలో 10 సెకెన్ల యాడ్ ఇవ్వాలంటే రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు వెచ్చించాల్సిందే. అంటే మిగతా మ్యాచ్‌ల కంటే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు డబుల్ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. ధరలు భారీగా పెంచినా సరే యాడ్స్ ఇవ్వడానికి పలు కంపెనీలు క్యూ కట్టాయి.
2016 టీ20 వరల్డ్ కప్ ఇండియాలో నిర్వహించిన సమయంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు 17.3 రేటింగ్ వచ్చింది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, దూరదర్శన్ ప్రసారం చేశాయి. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత అత్యధిక రేటింగ్ సాధించిన మ్యాచ్ అదే. టీవీల ద్వారా దాదాపు 73 కోట్ల మంది వీక్షించినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. గతంలో కంటే అది 114 శాతం ఎక్కువ. 2016 తర్వాత టీ20 వరల్డ్ కప్ జరగడం ఇదే. దీంతో ఈ టోర్నీకి కూడా భారీ రేటింగ్స్ వస్తాయని స్టార్ స్పోర్ట్స్ అంచనా వేస్తోంది. అందుకే టికెట్ రేట్లు కూడా భారీగా పెంచేసింది. ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.
ఐసీసీ ఈవెంట్లలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లకు ఉండే క్రేజే వేరు. దాయాదుల మధ్య పోరును ప్రత్యక్షంగా వీక్షించాలని కొంతమంది అనుకుంటే.. ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ టీవీలకు అతుక్కుపోయే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ఈ హై ఓల్టేజీ మ్యాచ్ ను చూసే ప్రేక్షకులకు యాడ్స్ రూపంలో తమ వ్యాపారాలను మరింత చేరువ చేయడానికి వ్యాపార సంస్థలు పోటీలు పడుతుంటాయి. గత కొద్దికాలంగా భారత్-పాక్ మ్యాచ్ అంటేనే మోకా.. మోకా యాడ్ రావాల్సిందే. ఐసీసీ ఈవెంట్లలో భారత్ ను పాక్ ఓడిస్తుందనే ఆశతో ఓ పాక్ అభిమాని క్రాకర్లు, స్వీట్ బాక్సులు పట్టుకురావడం.. తీరా మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవడంతో అతడు కుంగిపోతుంటాడు. గత కొద్దికాలంగా టీవీ ప్రేక్షకులను ఈ యాడ్ విపరీతంగా అలరిస్తోంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ తరుణంలో.. ఈ యాడ్ మళ్లీ సరికొత్తగా ముస్తాబైంది. ఈ యాడ్ లో ఎప్పుడూ కనిపించే పాక్ అభిమానే క్రాకర్స్ పట్టుకుని ఓ టీవీ షో రూంలోకి రావడం.. ఈసారి తమ జట్టు తప్పక గెలుస్తుందనడం.. ఇది చూసిన సదరు షాప్ ఓనర్ అతడికి ఓ బంపరాఫర్ ఇవ్వడం వంటివి అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ పై భారత్ కు ఉన్న తిరుగులేని రికార్డు కూడా మ్యాచ్ పై ఆసక్తి పెరగడానికి మరో కారణంగా ఉంది. ఇండియా మరోసారి గెలవాలని భారత్ అభిమానులు, ఇప్పుడైనా తమ దేశం గెలవాలని పాక్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లతో పాటు టీ20 ప్రపంచకప్ లో కూడా పాకిస్థాన్ జట్టుకు భారత్ పై తలవంచడం ఎప్పుడూ జరిగేదే. పొట్టి ఫార్మాట్ లో 2007 టీ20 ప్రపంచకప్ లో ఈ రెండు జట్లు తొలిసారి పోటీ పడ్డాయి. ఆ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. అదే టోర్నీ ఫైనల్ లో కూడా ధోని సేన.. షోయబ్ మాలిక్ నేతృత్వంలోని పాక్ ను చిత్తుగా ఓడించి కప్ నెగ్గింది. ఇరు జట్లు టీ20 ఫార్మాట్ లో చివరిసారి 2016 లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కూడా భారత్ ఘనవిజయం సాధించింది.
2016 టీ 20 వరల్డ్ కప్ తర్వాత టీ 20 ఫార్మాట్‌లో భారత్, పాకిస్తాన్ రెండూ అత్యుత్తమ ప్రదర్శనలను అందించాయి. గత ఐదేళ్లలో రెండు జట్లూ అత్యధిక విజయాలు నమోదు చేశారు. పెద్ద జట్లు ఏవీ కూడా ఇండియా-పాకిస్థాన్‌కి దగ్గరగా లేవు. కాబట్టి టీ 20 వరల్డ్ కప్ 2021 ఫైనల్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ నిజంగా తలపడతాయా? లేదా ఈ జట్లలో ఒకటి ఖచ్చితంగా ఫైనల్ ఆడుతుందా? అనేది చూడాల్సి ఉంది. భారత్, పాక్ మ్యాచ్ పై జరిగిన బిజినెస్ సంగతి పక్కనపెడితే.. రెండు దేశాల మధ్య క్రికెట్ ను బ్యాన్ చేయడం కేవలం భావోద్వేగంతో చేస్తున్న డిమాండేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆటను ఆటలాగే చూడాలనే వాదన గట్టిగానే వినిపిస్తోంది.