ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ లేఖ రాశారు. పెంచిన విద్యుత్ ఛార్టీల కారణంగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, వారిపై మోయలేని భారం పడిందని నారా లోకేష్ లేఖలో పేర్కొన్నారు. ట్రూఅప్ ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కుప్పకూలిన విద్యుత్ రంగాన్ని అత్యవసరంగా గాడిన పెట్టాలని, సీఎం ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని ప్రతీ సభలో చెప్పారని లేఖలో పేర్కొన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఒక్కసారి కూడా ఛార్జీలు పెంచలేదని, కాని అప్పట్లో పెంచినట్టుగా కొందరు అసత్యప్రచారం చేశారని, ఇప్పటి ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలంలో ఏకంగా 6 సార్లు విద్యుత్ ఛార్టీలు పెంచారని, మరోసారి ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ యూనిట్ ధర రూ. 3.12 కే లభిస్తుంటే, రాష్ట్రప్రభుత్వం యూనిట్ గరిష్టంగా రూ.20కి ఎందుకు కొనుగోలు చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. యూనిట్‌కు అదనంగా పెడుతున్న సొమ్ము రూ.16 ఎవరి జేబులోకి వెళ్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లించాల్సిన రూ. 12 వేల కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థలకివ్వాల్సిన రూ. 10,800 కోట్లు చెల్లిస్తే విద్యుత్ రంగం కుప్పకూలే దుస్థితి వచ్చేది కాదని నారా లోకేష్ లేఖలో పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుని సంక్షోభంలో పడిన విద్యుత్ రంగాన్ని కాపాడాలని సీఎం కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Read: తిరుపతిలో బిజీబిజీగా సీఎం జగన్…