(నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా)
బాల్యంలో యమ దూకుడుగా ఉన్న ఆ కుర్రాడిని ఇప్పుడు చూసిన వాళ్ళు, ఇంత సౌమ్యుడై పోయాడేమిటీ? అని ఆశ్చర్యపోతారు! యుక్తవయసులో అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే ఆ కుర్రాడు… వెండితెరపై ఇంతలా రొమాన్స్ పండిస్తున్నాడేమిటా అని విస్తుపోతారు! తాతగారు, మహానటుడు ఎన్టీఆర్ పేరును తన సొంత బ్యానర్ కు పెట్టుకున్నందుకు, అంతే భక్తి శ్రద్ధలతో సినిమాలు నిర్మిస్తున్న అతన్ని చూసి ఆనంద పడతారు! అతనే నందమూరి కళ్యాణ్ రామ్!! ఇవాళ కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు. 43 వసంతాలు పూర్తి చేసుకుని ఈ హీరో కమ్ ప్రొడ్యూసర్ ఈ రోజు 44వ సంత్సరంలోకి అడుగు పెడుతున్నారు.
హైస్కూల్ చదువుకు ముందు కళ్యాణ్ రామ్ ను చూసిన వాళ్ళు ఈ పిల్లాడికి ముకుతాడు ఎవరు వేయగలరు? అని అనుకునేవారట. ఒక్కో సమయంలో తండ్రికే కాదు తాతగారికి సైతం కళ్యాణ్ రామ్ అర్థమయ్యే వాడు కాదట. కానీ విజయవాడలో టెన్త్ చదివిన సమయంలో తన ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చిందంటారు కళ్యాణ్ రామ్. కన్నతల్లి లక్ష్మితో పాటు, చదువు చెప్పిన గురువు చంద్రశేఖర్ గారి కారణంగానే తన కెరీర్ గాడిలో పడిందని చెబుతారు నందమూరి హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్. గుంటూరులో ఇంటర్, కోయంబత్తూరులో ఇంజనీరింగ్, ఆ పైన యు.ఎస్.లో ఎమ్మెస్ చేసేశారు. ఉన్నత విద్యను అభ్యసించి కూడా మనసు చిత్రసీమ వైపు లాగడంతో అమెరికాలో ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వచ్చేశారు.
బాల నటుడిగా బాబాయి బాలకృష్ణ సినిమా ‘బాలగోపాలుడు’లో నటించినా, హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం ‘తొలి చూపులోనే’ సినిమాతోనే. అయితే ఆ తొలి చిత్రంతో పాటు, మలి చిత్రం ‘అభిమాన్యు’ కూడా కళ్యాణ్ రామ్ ను నిరాశకు గురిచేసింది. ఇక లాభం లేదని 2005లో తన తాతగారు ఎన్టీఆర్ పేరుతో సొంత బ్యానర్ పెట్టి ‘అతనొక్కడే’ సినిమాను తీశారు కళ్యాణ్ రామ్. బహుశా అప్పటి నుండే పెద్దాయన ఆశీస్సులు మెండుగా కళ్యాణ్ కు లభించినట్టున్నాయి. అక్కడ నుండి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ముందుకే సాగుతున్నారు.
కళ్యాణ్ రామ్ తో బయటి సంస్థలు రొటీన్ సినిమాలు చేసినా… ఆయన మాత్రం నిర్మాతగా వైవిధ్యానికే ప్రాధాన్యమిచ్చారు. అందుకే ఇవాళ్టికీ తనకంటూ ఓ స్థానాన్ని చిత్రసీమలో సంపాదించున్నారు. ఎన్టీఆర్ బ్యానర్ లో వచ్చిన ‘హరేరామ్’ నటుడిగా కళ్యాణ్ రామ్ కు మంచి గుర్తింపును తెచ్చిపెడితే, ‘ఓమ్’ త్రీడీ మూవీ ప్రొడ్యూసర్ గా కళ్యాణ్ రామ్ గట్స్ ను తెలియచేసింది. దానికి ముందు ‘జయీభవ’, ‘కళ్యాణ్ రామ్ కత్తి’ వంటి సినిమాలు పరాజయం పాలైనా అతను వెనక్కి తగ్గలేదు. ‘ఓం త్రీడీ’ తర్వాత నిర్మించిన ‘పటాస్’తో మరో సూపర్ హిట్ ను అందుకుని హీరోగా తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. ఆ తర్వాత రవితేజ హీరోగా నిర్మించిన ‘కిక్ 2’, తాను హీరోగా నటించి, పూరితో తీసిన ‘ఇజం’ సైజం కళ్యాణ్ రామ్ కు లాభాలు తెచ్చిపెట్టలేదు. అయినా… తన తమ్ముడు ఎన్టీఆర్ తో సూపర్ హిట్ మూవీ ‘జై లవకుశ’ను నిర్మించి, నిర్మాతగా తన సత్తాను మరోమారు చాటుకున్నారు.
విశేషం ఏమంటే… నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషిస్తూ ‘ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాలు నిర్మిస్తే… అదే సినిమాలో కళ్యాణ్ రామ్ సైతం తన తండ్రి హరికృష్ణ పాత్రను పోషించారు. ఇది కళ్యాణ్ రామ్ నట జీవితంలో ఓ మర్చిపోలేని ఘటన.
కళ్యాణ్ రామ్ కు బయటి బ్యానర్ సినిమాలు అచ్చిరావు అనే సెంటిమెంట్ ను ఆ మధ్య వచ్చిన ‘118’ మూవీ తుడిచిపెట్టేసింది. దానికి ముందు వచ్చిన ‘ఎం.ఎల్.ఎ.’ మూవీ ఫర్వాలేదనిపిస్తే, ‘118’ మంచి విజయాన్ని సాధించింది. ఆ విజయంతో కలిగిన ఉత్సాహంతోనే కళ్యాణ్ రామ్ ఇప్పుడు మూడు చిత్రాలలో నటిస్తున్నాడు. రెండు ప్రాజెక్ట్స్ ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. అందులో ‘బింబిసార’ అనే సినిమాను కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తుండగా, కళ్యాణ్ రామ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ మూవీతో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక మరో సినిమా తన తమ్ముడు ఎన్టీఆర్ తో తీయబోతున్నాడు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో సుధాకర్ మిక్కిలినేని నిర్మించబోతున్న సినిమాకు కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఇక మీదట కూడా ఎన్టీఆర్ నటించే సినిమాల నిర్మాణంలో కళ్యాణ్ రామ్ భాగస్వామిగా ఉండే ఆస్కారం కనిపిస్తోంది. ఎందుకంటే… దీనికి ముందు త్రివిక్రమ్ – ఎన్టీఆర్ మూవీని ప్రకటించినప్పుడు సైతం కళ్యాణ్ రామ్ ప్రెజెంటర్ గా ఉన్నాడు. సో… ఈ ఆనవాయితీ మున్ముందు కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలానే దిల్ రాజు బ్యానర్ లో కె. వి. గుహన్ దర్శకత్వంలో సినిమా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మరో మూవీలో కళ్యాణ్ రామ్ నటించబోతున్నాడు.
ఏదేమైనా… ఉన్నత చదువులు చదివి చిత్రసీమలోకి హీరోలుగా వచ్చి నిలదొక్కుకున్న వాళ్ళను మనం వేళ్ళ మీదే లెక్కించొచ్చు. అలాంటి వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. తన బలం, బలగం తమ్ముడు ఎన్టీయార్ తో పాటు, బావమరిది హరికృష్ణ కూడా అంటారు కళ్యాణ్ రామ్. వాళ్ళిద్దరి సహకారంతో కళ్యాణ్ రామ్ హీరోగా, ప్రొడ్యూసర్ గా జైత్రయాత్ర సాగించాలని కోరుకుందాం.