హైదరాబాదులో కోట్ల రూపాయల భూమిని ఇచ్చి ఇరవై అయిదు కోట్ల రూపాయల వ్యయంతో గిరిజన కొమురంభీమ్ భవనాన్ని నిర్మిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం ఆమె నిర్మల్ జిల్లాలో మాట్లాడుతూ.. గిరిజన బిడ్డలు కోరుకున్న గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసామని, గిరిజనులు, పేదలను ఇన్ని రోజులు ఓట్ల సాధనాలుగానే చూశారని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలంలో అరవై అయిదు సీట్లు ఇస్తే, అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎనభై అయిదు సీట్లను కట్టబెట్టే అధికారం ఇచ్చారన్నారు.
మూడోసారి సైతం బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చి టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించబోతోందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. పోడు రైతుల సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని, పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు త్వరలో ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇస్తామని, ఆ భూములను అభివృద్ధి చేసి వాటికి నీటి సౌకర్యం కల్పించి సాగుకు యోగ్యంగా మారుస్తామన్నారు. వాటికి కూడా రైతుబంధు రైతు బీమా వర్తింప చేసేలా చూస్తామన్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు రోజుకొకరు రాష్ట్రానికి వచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నారని, తెలంగాణ రాష్ట్ర పథకాలేమైనా వారి రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా అని ఆమె విమర్శించారు.