కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుప్పం నుంచే పోటీ చేస్తానని, గెలిచి సీఎంను అవుతానని ధీమా వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్‌గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. మేము బెదిరిపోయే పరిస్థితి లేదు, చంద్రబాబుకి కాలం మూడింది అని ఆయన అన్నారు. చంద్రబాబు కుప్పంలోనే పోటీ చేస్తాను అనడాన్ని ఆహ్వానిస్తున్నామని, చంద్రబాబు పోటీ చేస్తాడు, కుప్పంలో ఓడిపోతాడు. పారిపోకూడదని మేము ఆశిస్తున్నాం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీ ఓటమి కుప్పంలో మేము చూడాలి, పారిపోవడం కాదు.
అప్పుడే ప్రజలకు నువ్వేంటో అర్ధమవుతుందని ఆయన అన్నారు. పుంగనూరులో నీకు కండిడేట్ లేడు, ఎవరిని పోటీ పెట్టి గెలుస్తావ్, నీ దగ్గర ఉన్న అటెండర్ ను పెట్టి నిన్ను కుప్పంలో ఓడించే సత్తా మాకు ఉంది అని మంత్రి సవాల్ విసిరారు. చంద్రబాబుకు నిజంగానే జగన్ మోహన్ రెడ్డి భయం పట్టుకుందని, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు చంద్రబాబును షాక్ కు గురి చేశాయని ఆయన అన్నారు. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.