ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమావేశమయ్యారు. అంతకుముందు ఇద్దరు సహాయమంత్రులను కూడా బుగ్గన కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన ఓ కాంట్రాక్ట్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో ఉందని.. లండన్‌లో మొదటి దఫా ఆర్బిట్రేషన్ జరిగిందని… ఇప్పుడు రెండో దఫా జరగాల్సి ఉందన్నారు. న్యాయపరమైన అంశాలు కాబట్టి వీటిలో జాప్యం జరుగుతోందని బుగ్గన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు.
Read Also: వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు: టీడీపీ నేత పట్టాభి
కాగా అనంతరం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం చెప్పామని.. ప్రస్తుతానికి తాము వ్యాట్ తగ్గించలేమని బుగ్గన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆదాయ వనరులు చాలా అవసరమని… రాష్ట్రానికి చమురు ఉత్పత్తులు, మద్యం ద్వారా మాత్రమే నేరుగా పన్నుల రూపంలో ఆదాయం వస్తోందన్నారు. మిగతావన్నీ జీఎస్టీ పరిధిలో ఉన్నాయని.. అందువల్ల రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలు అంత సులభంగా తీసుకోలేమన్నారు. అన్ని రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి కాబట్టి.. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా అని.. తాము 24 గంటల్లో నిర్ణయాలు తీసుకోలేమన్నారు. కేంద్ర ఖర్చులు వేరు… రాష్ట్రాల ఖర్చులు వేరు అని గుర్తుపెట్టుకోవాలన్నారు.