న్యూఇయర్ రోజు విజయనగరం జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఒంగి తనకు నమస్కారం పెట్టడంపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అది పెద్ద చిన్నా తారతమ్య సంస్కారానికి సబంధించిన అంశం అన్నారు. ఆయనేమీ నాకు సాష్టాంగం చేయలేదు, కాళ్లు పట్టుకోలేదు. వయసులో 20 ఏళ్ల పెద్ద వాళ్ళు కనిపించినపుడు వంగి నమస్కరించడం మన సంప్రదాయం అన్నారు బొత్స.
సాంప్రదాయాలను కూడా వక్రీకరించి విమర్శలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. హయగ్రీవ భూముల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ప్రభుత్వంలో తప్పు చేస్తే తరతమ భేదం ఉండదు. వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులతో మాట్లాడానన్నారు మంత్రి బొత్స. పేపర్లలో వచ్చిన ఫోటోలకు, సర్క్యూట్ హౌస్ లో జరిగిన దానికి ఏమాత్రం సంబంధం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
హైదరాబాద్ లో జరిగిన కాపు నాయకుల సమావేశానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఓ వివాహం కోసం వెళ్లే ముందు హోటల్లో కాఫీ తాగుతూ మాట్లాడుకున్న మాటలు అవి. ఆ సమావేశానికి నన్ను పిలిచారు. మరో సమావేశం జరిగిన విషయం గురించి నాకు తెలియదు. కడుపు మంటతో ఉన్న వాళ్ళు కలిసి మాట్లాడుకుంటే దానికి మాకు ఏం సంబంధం. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతోషంగా వున్నాయన్నారు బొత్స. తన ఇంటిపై రెక్కీ జరిగిందని రాధానే చెప్పాడు…. దానిపై డీజీ కూడా స్పందించారు. నిర్ణయాలు చెప్పడానికి చంద్రబాబు ఏమైనా అంబుడ్స్ మెన్నా అని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.