మహారాష్ట్రలో కోవిడ్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నది. ముంబైలో ఉదయం సమయంలో 144 సెక్షన్ అమలులో ఉంది. రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో త్వరలోనే పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు మహారాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ థర్డ్ వేవ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆందోళన నెలకొనేలా చేశాయి.
Read: ఎలన్ మస్క్ పన్నుపై యూఎస్ లో రచ్చ…
జనవరి చివరి వారం వరకు 80 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, అందులో ఒక శాతం వరకు మరణాలు సంభవించవచ్చని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి చివరి వారం వరకు మహారాష్ట్రలో రెండు లక్షల వరకు యాక్టివ్ కేసులు ఉండే అవకాశం ఉందని అన్నారు. కరోనా కేసులు పెరిగినా ఎదుర్కొనడానికి సన్నద్ధంగా ఉండాలని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారే అధికంగా కోవిడ్, ఒమిక్రాన్ బారిన పడుతున్నారని, వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. కోవిడ్, ఒమిక్రాన్ లక్షణాలు పెద్దగా కనిపించడం లేదని, జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.