మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) గొడవలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటీవల మా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్‌లు హోరాహోరీగా పోటీపడ్డాయి. అనంతరం మా ఎన్నికల ఫలితాల్లో మంచు విష్ణు ప్యానెల్ గెలవడంతో విష్ణు మా కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో 11 మంది సభ్యులు కూడా గెలుపొందారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో గెలిచిన హీరో శ్రీకాంత్, ఉత్తేజ్‌లతో సహా 11 మంది రాజీనామాలు చేశారు.
దీంతో మా అధ్యక్షుడు వారిని రాజీనామాలు చేయవద్దని గత రెండు నెలలుగా సంప్రదింపులు జరిపారు. ఈ సంప్రదింపులు విఫలం కావడంతో 11 మంది రాజీనామాలను ఆమోదించినట్లు మంచు విష్ణు తెలిపారు. అయితే ప్రకాశ్‌రాజ్, నాగబాబు లు తమ మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ.. మంచు విష్ణు వారి రాజీనామాలను ఆమోదించలేదు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌కు చెందిన సభ్యుల రాజీనామా ఆమోదించడంతో నూతన కోరం కోసం వేరే సభ్యులను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.