కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులను బలి తీసుకుంది. తాజాగా ప్రముఖ దర్శకనిర్మాత యు.విశ్వేశ్వరరావు కరోనాతో కన్నుమూశారు. ‘విశ్వశాంతి’ పతాకంపై విశ్వేశ్వరరావు నిర్మించిన పలు చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా విశ్వేశ్వరరావు తనదైన బాణీ పలికించారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు దేశవిదేశాలలో ప్రదర్శితమయ్యాయి. ప్రభుత్వ అవార్డులనూ, ప్రేక్షకుల రివార్డులనూ పొందాయి. నేటికీ ఆ నాటి సినీజనం ‘విశ్వశాంతి’ విశ్వేశ్వరరావు అనే ఆయనను గుర్తు చేసుకుంటారు. తన చిత్రాలలో స్టార్స్ ను పక్కకు పెట్టి, గుణచిత్ర నటులతోనూ, వర్ధమాన నటీనటులతోనూ ముందుకు సాగారు. ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన ‘నగ్నసత్యం’ (1979), ‘హరిశ్చంద్రుడు’ (1980) చిత్రాలు వరుసగా ఉత్తమ తెలుగు చిత్రాలుగా జాతీయ అవార్డులు సంపాదించాయి. ‘కీర్తి కాంత కనకం’తో ఉత్తమ దర్శకునిగా, ‘పెళ్ళిళ్ళ చదరంగం’తో బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డులు అందుకున్నారు విశ్వేశ్వరరావు. ఈ చిత్రాలలో కొన్ని ఆయనకు లాభాలు సంపాదించి పెట్టాయి. మరికొన్ని అవార్డులు అందించాయి. 1990ల నుంచీ చిత్రనిర్మాణానికి ఆయన దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న విశ్వేశ్వరరావు వయసు 90 ఏళ్ళ పైమాటే! మహానటుడు యన్టీఆర్ కు విశ్వేశ్వరరావు వియ్యంకుడు. యన్టీఆర్ తనయుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణకు, విశ్వేశ్వరరావు కూతురు శాంతి భార్య. మోహనకృష్ణ, శాంతి తనయుడే నవతరం నటుడు నందమూరి తారకరత్న.