ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి జగన్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల మంటలు వేడిరాజేస్తూనే వున్నాయి. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు తమ దైన రీతిలో మండిపడుతూనే వున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పట్టాభి ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాయలసీమ ప్రాంతంలో చేసి ఉంటే అడ్రస్ లేకుండా ఉండేవాడని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. 2024లో చంద్రబాబుని రాష్ట్రం నుండి పంపిచేస్తే జగన్‌ని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే రాష్ట్రానికి పట్టిన గ్రహణం పోతుందని ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని రాయల్ చెరువు లో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఆయన జనాగ్రహదీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి వ్యాఖ్యల వెనక చంద్రబాబు, లోకేష్ హస్తం ఉందని ఆరోపించారు.
ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలంతో మాట్లాడితే ఆయన అభిమానులు గాని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాని తప్పనిసరిగా దాడి చేస్తారన్నారు. పట్టాభి, జేసి ప్రభాకర్ రెడ్డి లాంటి వారిని మహిళలు చెప్పుతో కొట్టినా సిగ్గురాదన్నారు. జగన్ మోహన్ రెడ్డి ని ఏ విధంగా అయినా భ్రష్టు పట్టించాలన్న ఉద్దేశంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రజల్లోకి పోవాలని టీడీపీ నాయకులు చూస్తున్నారన్నారు.
జగన్ జనరంజక పాలనకు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకే తెలుగుదేశం పార్టీ వారు ఇలాంటి కుట్రలు చేపడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా 2024లో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని కేతిరెడ్డి జోస్యం చెప్పారు.