జమ్మూ కశ్మీర్‌లో హిమపాతం బీభత్సం సృష్టించింది. గుల్‌మార్గ్‌లో మంచు చరియలు విరిగిపడడంతో ముగ్గురు విదేశీ పర్యాటకులు చిక్కుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనాస్థలికి వెళ్లి వెలికితీయగా ఒక రష్యన్ ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరిని రక్షించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకో ఆరుగురిని కూడా రెస్క్యూ సిబ్బంది రక్షించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు చిక్కుకున్నారేమోనన్న సమాచారంతో ఆర్మీ, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైంది.హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. ప్రస్తుతం మంచు పర్వతాలను జల్లెడ పడుతున్నారు.
వాస్తవానికి కొండచరియలు దగ్గరకు వెళ్లేటప్పుడు స్థానికులను సహాయంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ పర్యాటకులు మాత్రం ఎలాంటి సాయం లేకుండానే.. విదేశీ పర్యటకులు కొంగ్‌డోరి వాలు ప్రాంతంలో స్కీయింగ్ వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా కశ్మీర్‌ను మంచు కమ్మేసింది. హిమపాతం కారణంగా ఎత్తైన ప్రాంతాలతో పాటు లోయలూ మంచుతో నిండిపోతున్నాయి. దీంతో స్కీయింగ్‌కు పేరుపొందిన గుల్‌మార్గ్‌కు పర్యటకులు వెల్లువెత్తారు. పర్వత ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడే ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా కూడా నిర్లక్ష్యంగా ముందుకు వెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Dee