భారీవర్షాలు కడప జిల్లాలో పురాతన బ్రిడ్జిల పాలిట శాపంగా మారాయి. వరదకు కుంగిపోయింది కమలాపురం పాపాగ్ని బ్రిడ్జి. ఏ క్షణమైనా కూలిపోయేందుకు సిద్ధంగా వుంది. వరద ధాటికి చీలిపోయిన బ్రిడ్జి శ్లాబ్ క్రమ క్రమంగా దిగువకు కుంగిపోయిందని పోలీసులు, రెవిన్యూ అధికారులు తెలిపారు. ఏ క్షణంలో నైనా కమాలపురం బ్రిడ్జి కుప్పకూలే ప్రమాదం ఉందని డి.ఎస్.పి వెంకట శివారెడ్డి తెలిపారు.
బ్రిడ్జి ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి నేషనల్ హై వే అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు పోలీసులు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఎస్పీ. బ్రిడ్జి కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. బ్రిడ్జికి ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కమలాపురం నుండి బ్రిడ్జి మీదుగా కడప వైపు వాహనాలు రాకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు.
వల్లూరు మీదుగా వెళ్లే వాహనాలు బ్రిడ్జి వైపు రాకుండా దారి మళించామని డీఎస్పీ తెలిపారు. వాహనాలు ప్రత్యామ్నాయ మార్గంలో గమ్యస్థానాలకు చేరుకోవాలని కడప డి.ఎస్.పి వెంకట శివారెడ్డి సూచించారు. అనంతపురం, తాడిపత్రి వెళ్లాల్సిన వారు మైదుకూరు, ప్రొద్దుటూరు లేదా పులివెందుల మీదుగా వెళ్లాలన్నారు. కమలాపురం, ఎర్రగుంట్ల నుండి కడప వైపు వెళ్లే వాహనాలు ప్రొద్దుటూరు లేదా పులివెందుల మీదుగా వెళ్ళాలని సూచించారు. కడప నుండి ఎర్రగుంట్ల వెళ్లాల్సిన వారు మైదుకూరు మీదుగా వెళ్ళాలన్నారు డీఎస్పీ.