కరోనా కట్టడి కోసం ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్.. అయితే, కేంద్రం వ్యాక్సినేషన్ విధానంపై ఎన్నో విమర్శలు, మరెన్నో ఆరోపణలు.. ఓవైపు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు, ప్రతిపక్షాల డిమాండ్లు, ఇంకోవైపు సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం.. దీంతో కేంద్రం దిగిరాకతప్పలేదు.. అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ అంటూ.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.. రాష్ట్రాలు ఒక్కరూపాయి కూడా వ్యాక్సిన్లపై ఖర్చు చేయాల్సిన అవసరం లేదని.. కేంద్రమే రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని.. 75 శాతం రాష్ట్రాలకు సరఫరా చేస్తే.. 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇక, ప్రధాని మోడీ ప్రకటనను బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఆ పార్టీ నేతలు స్వాగతిస్తుంటే.. సుప్రీంకోర్టు మందలించడంతోనే ఆలస్యంగా ఈ ప్రకటన చేశారని విపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి.. ఉచిత వ్యాక్సినేషన్ పై సుప్రీంకోర్టు ఉత్తర్వులతోనే ప్రధాని మోడీ స్పందించారని, ఈ నిర్ణయం ప్రకటించేందుకు ఇంత సమయం ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు..
ఇక, ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన తర్వాత సుప్రీంకోర్టుపై.. జస్టిస్ చంద్రచూడ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.. కేంద్రం వ్యాక్సినేషన్ విధానంలోని లోపాలను జస్టిస్ చంద్రచూడ్ ఎండగట్టడంతోనే ఇది సాధ్యమైందని నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. జస్టిస్ చంద్రచూడ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.. దీంతో.. ఓ దశలో ట్రెండింగ్‌లోకి వచ్చారు చంద్రచూడ్.. సుప్రీంకోర్టు విచారణ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆదేశాలను తరువాతి రోజు మీడియా రిపోర్ట్ చేసిన తీరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడేసిందంటున్నారు విశ్లేషకులు.. వ్యాక్సిన్ సంబంధించిన నోటింగ్స్‌తో సహా మొత్తం ఫైల్స్‌ను తమ ముందు ఉంచమని సుప్రీం కోర్టు చెప్పడంతో.. ఇక, వ్యాక్సిన్ బాధ్యతను కేంద్రం చేతిలోకి తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించాల్సి వచ్చిందని.. సోషల్ మీడియా కోడై కూస్తోంది..