యంగ్ టైగర్ ఎన్టీయార్ కొత్త సినిమాకు సంబంధించిన సర్ ప్రైజ్ న్యూస్ అధికారికంగా వెలువడింది. ఎన్టీయార్ 30వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు. ఎన్టీయార్ తో ఐదేళ్ళ క్రితం కొరటాల శివ తీసిన “జనతా గ్యారేజ్’ ఘన విజయాన్ని సాధించింది. దాంతో ఇప్పుడీ సినిమాకు సూపర్ క్రేజ్ రాబోతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని నిర్మించే ఈ సినిమా వచ్చే యేడాది వేసవి కానుకగా ఏప్రిల్ 29న విడుదల కానుంది. సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే… రిలీజ్ డేట్ ను ప్రకటించడం విశేషం. ‘జనతా గ్యారేజ్’లో మాదిరి ఈ సారి రిపేర్లు లోకల్ గా ఉండవని, సరిహద్దులు దాటుతాయని కొరటాల శివ ట్వీట్ చేశారు. దాంతో ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతోందనే హింట్ ఇచ్చినట్టు అయ్యింది.
నిజానికి ఎన్టీయార్ 30వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాల్సి ఉంది. ఆ విధంగా ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. హారిక అండ్ హాసిని బ్యానర్ లో అది నిర్మితం కావాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాను తెరకెక్కిస్తున్న కొరటాల శివ… అది విడుదల కాగానే ఈ యేడాది ద్వితీయార్థంలో ఎన్టీఆర్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నారు. అందుకే విడుదల తేదీని సైతం ఇవాళే ప్రకటించారు. మరి ఎన్టీయార్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.