తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ కూలిన దుర్ఘటన యావత్ దేశాన్ని కన్నీటిపర్యంతం చేసింది. 13 మంది ఈ ప్రమాదంలో కన్నుమూశారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు బిడ్డ లాన్స్ నాయక్ హోదా సాయి తేజ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సీడీఎస్ బిపిన్ రావత్‌కి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా సాయితేజ సేవలందిస్తున్నారు. తన బాస్ బిపిన్ రావత్ తో కలిసి వెల్లింగ్టన్ వెళుతున్న వేళ.. తన భార్య శ్యామలకు ఒక సందేశం పంపారు సాయితేజ.
”హ్యాపీగా ఉండు.. Happy ga undu” అంటూ పంపిన సందేశం ఇప్పుడు వైరల్ అవుతోంది. సరిగ్గా ప్రమాదం జరగడానికి 4 గంటల ముందు ఈ సందేశం భార్యకు చేరింది. ఒకరోజు ముందు మదనపల్లిలో వున్న భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడారు సాయితేజ. పిల్లలతో మాట్లాడే టైం లేదని బాస్‌తో కలిసి టూర్‌కి వెళుతున్నామని మాట్లాడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఉదయం 8.45కి వీడియో కాల్ చేశారు సాయితేజ. బాస్ కార్యక్రమం అయ్యాక సాయంత్రం ఢిల్లీనుంచి ఫోన్ చేస్తానని, పిల్లలతో మాట్లాడించాలని సాయితేజ కోరారు. అది జరగకుండానే సాయితేజ తిరిగి రాని లోకాలకు చేరిపోయాడు ఈ అమరసైనికుడు.
భర్త మాట్లాడిన మాటల్ని గుర్తుచేసుకుంటూ.. కన్నీటి పర్యంతం అవుతోంది భార్య శ్యామల. నాన్న ఎప్పుడు వస్తారు.. అని అడిగే తన పిల్లలకు తానేం చెప్పాలని ఆమె మౌనంగా రోధిస్తోంది. ”పిల్లలమీద బాగా ధ్యానం తిరిగింది.. జనవరిలో వచ్చి వారితో గడుపుతాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో “అంటూ భార్యను ఫోన్‌లో ఓదార్చారు సాయితేజ. అవన్నీ గుర్తుకు వచ్చినప్పుడు భార్య నేత్రాలు కన్నీటి చెలమలవుతున్నాయి. సంక్రాంతికి తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలని భావించారు సాయితేజ.
రేగడివారి పల్లెకు చెందిన బి.మోహన్, బి.భువనేశ్వరి దంపతుల ఇద్దరు సంతానంలో పెద్దవాడు సాయితేజ. అతని తమ్ముడు కూడా సైన్యంలో వున్నాడు. ఉన్న ఇద్దరు పిల్లలు సైన్యంలో చేరగా.. పెద్ద కొడుకు సాయితేజ రక్షణ విధుల్లోనే కన్నుమూశాడు. ఆ వీరునికి జన్మనిచ్చిన దంపతులను చూసి ఆ ఊరంతా ఒక్కటై వచ్చి ఓదారుస్తోంది.
రక్షణ విధుల్లో తలమునకలయ్యే సాయితేజ సెలవుల్లో గ్రామానికి వచ్చినప్పుడు అందరితో ఆప్యాయంగా మెలిగేవాడని చెబుతున్నారు. ఇప్పటికీ ఆ ఊరు నమ్మలేకపోతోంది. ఎప్పుడూ లేనిది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు.. తల్లి శ్యామల గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు. ఏం జరిగిందో తెలియక చిన్నారులు మోక్షజ్ఞ, దర్శిని అందరి ముఖాల్లోకి దీనంగా చూస్తున్నారు. ఈ దృశ్యం చూసిన వారంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. అతని అంకితభావమే సీడీఎస్ దగ్గర పనిచేసే అవకాశాన్ని కల్పించిందని, తన బాస్‌తో పాటు సాయి తేజ కూడా తిరిగి రాని లోకాలకు చేరిపోయాడని కుటుంబసభ్యులు, ఆర్మీ స్టాఫ్ కన్నీటి పర్యంతం అవుతున్నారు.