కరోనా ఎంట్రీతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి అందరికీ తెల్సిందే. గత రెండుళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. కరోనా దాటికి లక్షలాది మంది మృత్యువాతపడగా, కోట్లాది మంది ఉద్యోగాల్లేక వీధిన పడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు వారిపై మరింత పన్నుల భారం మోపుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్ ధరలు సామాన్యుడి జీవితాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి.
చమురు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయనే సాకుతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఉత్పత్తులపై ఇష్టారీతిన పన్నులు పెంచుకుంటూ పోతుంది. దీంతో నిత్యావసర ధరల పెరుగుదలకు హద్దు అదుపు లేకుండా పోతోంది. కొన్ని నెలలుగా పెట్రోల్ ధరలు పెరగడమేగానీ తగ్గిన దాఖలాలు లేవు. ప్రతీరోజు 20పైసలు, 30పైసలు, 50పైసల చొప్పున ధరల చొప్పున ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంది. జేబులకు చిల్లుపడింది కూడా తెలియకుండానే సామాన్యుడి నడ్డిని విరుస్తోంది.
ఇప్పటికే పెట్రోల్, డిజీల్ ధరలు సెంచరీని దాటేశాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.110 ఉండగా డిజీల్ ధరలు రూ.103గా ఉంది. ముఖ్య పట్టణాల్లో ఈ రేటు ఇంకొంచెం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వంట గ్యాస్ ధరలు కూడా ప్రతీనెలా మారుతున్నాయి. ప్రస్తుతం వంట గ్యాస్ ధరకు వెయ్యి రూపాయాలకు అటూ ఇటుగా ఉంది. ఈ పరిణామాలన్నీ కూడా సామాన్యుడిపై ప్రభావం చూపుతున్నాయి. అసలే పనుల్లేక పస్తులుంటున్న జనాలపై పెట్రో ఉత్పత్తుల పేరిట పన్నులను పెంచడం శోచనీయంగా మారింది.
కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇది సామాన్యుడికి ఏమేరకు అందిందో తెలియదు గానీ పెట్రో ధరల పెరుగుదలతో సామాన్యుడి జేబుకు మాత్రం చిల్లు పడుతోంది. పెట్రోల్, డిజీల్ ధరలు అందన ఎత్తులోకి వెళ్లిపోవడంతో మోదీ సర్కారుపై ప్రజల్లో ఒక్కింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో మోదీ ఇమేజ్ క్రమంగా మసకబారుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలపై మోదీ సర్కార్ సైతం బెంబేలెత్తిపోతుంది.
ఇక త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో మోదీ సర్కార్ అలర్ట్ అవుతోంది. పెట్రోల్, డిజీల్ ధరల పెరుగుదల సామాన్యులపై ప్రభావం చూపుతుండటంతో ఆ వ్యతిరేకత వచ్చే ఎన్నికలపై పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. పెట్రోల్ ధరలకు కళ్లెంవేసేలా కేంద్ర ఆర్ధిక శాఖ పెట్రోలియం శాఖతో సంప్రదింపులు చేస్తోంది. పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్ ధరలపై పన్నులు తగ్గించి సాధారణ స్థితికి తీసుకు రావాలని ప్రయత్నం చేస్తోంది.
దీనికితోడు ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేలా కొత్తకొత్త హామీలు ఇచ్చేందుకు మోదీ సర్కారు రెడీ అవుతోంది. అయితే ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గించినా ఎన్నికల తర్వాత మళ్లీ పెరగడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. ఏదిఏమైనా గత కొంతకాలంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల పెరుగుదలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కళ్లెం వేయనుండటం ఒకింత గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ప్రజలను మభ్యపెట్టేలా కేంద్ర సర్కారు చేయబోయే మాయజాలం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సిందే..!