NTV Telugu Site icon

IND vs WI: నేటి నుంచి వెస్టిండీస్‌తో భారత్ తొలి టెస్టు.. ఓపెనర్‌గా జైస్వాల్

Ind Vs Wi

Ind Vs Wi

IND vs WI: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఓటమి తర్వాత సరిగ్గా నెల రోజుల విరామం అనంతరం భారత అభిమానుల కోసం మళ్లీ క్రికెట్‌ సందడి మొదలైంది. భారత జట్టు మరోసారి సంప్రదాయ క్రికెట్‌లో కొత్త పోరుకు సన్నద్ధమైంది. 2023–25 డబ్ల్యూటీసీ క్యాలెండర్‌లో భాగంగా భారత్‌ తమ తొలి సిరీస్‌ బరిలోకి దిగనుంది. ఈ సారి వెస్టిండీస్‌ రూపంలో బలహీన ప్రత్యర్థి భారత్‌ ముందుంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో గణనీయమైన ఎదురుదెబ్బను ఎదుర్కొన్న వెస్టిండీస్.. టీమిండియాకు ఏ మాత్రం పోటీనివ్వగలుగుతుందో చూడాలి. అదనంగా, రెండు జట్లకు చెందిన కొంతమంది ఆశాజనక యువ ఆటగాళ్లు ఈ సిరీస్‌లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేస్తారని, వారికి విలువైన అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: WFI Controversy: బ్రిజ్‌భూషణ్ విచారణ చేయబడతారు, శిక్షించబడతారు.. ఛార్జిషీట్‌లో పోలీసులు

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడిన టీమిండియా నుంచి చూస్తే దాదాపు అదే తుది జట్టుతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్‌ కోసం కొత్తగా ప్రయత్నించేందుకు యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ రూపంలో భారత్‌కు అవకాశం ఉంది. ఛెతేశ్వర్ పుజారా నిష్క్రమణతో భారత టాప్-ఆర్డర్‌లో ఖాళీ ఏర్పడటంతో, ముంబైకి చెందిన అపారమైన ప్రతిభావంతుడైన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్‌కు అవకాశం లభించింది. ముంబైకి ఓపెనర్‌ అయిన యశస్వి ఇక్కడా ఓపెనర్‌గా, గిల్‌ మూడో స్థానంలో ఆడటం దాదాపు ఖాయమైంది. కెమర్ రోచ్, షానన్ గాబ్రియేల్, అల్జారీ జోసెఫ్, జాసన్ హోల్డర్‌లతో కూడిన అనుభవజ్ఞులెన బౌలర్ల బౌలింగ్ అటాక్‌తో జైస్వాల్ అగ్నిపరీక్షను ఎదుర్కోనున్నాడు. ప్రధాన బ్యాటర్లలో రోహిత్, గిల్, కోహ్లిలపై బ్యాటింగ్‌ భారం ఉంది. ఓవల్‌ టెస్టులో రాణించి తన స్థానం నిలబెట్టుకున్న రహానే వైస్‌కెపెటన్‌గా మరింత అదనపు బాధ్యతతో ఆడనున్నాడు. బౌలింగ్‌లో షమీకి ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినివ్వగా… నవదీప్‌ సైనీ లేదా జైదేవ్‌ ఉనాద్కత్‌లలో ఒకరికి అవకాశం లభిస్తుంది. ప్రధాన పేసర్‌గా సిరాజ్‌… స్పిన్నర్లుగా రవీంద్ర జడేజాతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడని అశ్విన్‌ కూడా తుది జట్టులో ఉంటారు.

చాలా కాలంగా పేలవ ఫామ్‌లో ఉన్న వెస్టిండీస్ జట్టు.. చివరిసారిగా మార్చిలో టెస్టు సిరీస్‌ ఆడిన ఆ జట్టు 0–2తో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్, తేజ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌ ఓపెనర్లుగా అందించే ఆరంభం జట్టుకు కీలకం కానుంది. తర్వాతి బ్యాటర్లలో రీఫర్, బ్లాక్‌వుడ్‌ మాత్రమే నమ్మదగిన ఆటగాళ్లు. ఆల్‌రౌండర్‌గా రోచ్‌ అనుభవం జట్టుకు ఉపయోగపడవచ్చు. కైల్‌ మేయర్స్‌ లేకపోవడం లోటు. రోచ్, జోసెఫ్, హోల్డర్‌ పేస్‌ బౌలింగ్‌ భారం మోస్తారు. షెనాన్‌ గాబ్రియెల్‌కు అవకాశం దక్కుతుందా చూడాలి. వీరు తమ స్థాయికి తగినట్లుగా ఆడితే భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. కార్న్‌వాల్‌ రూపంలో రెండో స్పిన్నర్‌ జట్టులో ఉన్నాడు.

Also Read: IND vs WI Test: టీమిండియాపై గెలిచి 21 ఏళ్లైంది.. ఈసారైనా గెలిచేనా..?

ప్రస్తుత భారత జట్టుకు విండీస్‌ కనీస పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్ క్వాలిఫయర్స్‌లో ఆ జట్టు దయనీయ పరిస్థితిని అందరు చూసే ఉంటారు. అయితే ముఖాముఖి రికార్డుల్లో మాత్రం టీమిండియాపై విండీస్‌దే పై చేయిగా నిలిచింది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన 98 మ్యాచ్‌ల్లో.. విండీస్‌ 30 గెలిస్తే, భారత్‌ జట్టు మాత్రం 22 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. మరి చూడాలి ఈ టూర్‌లో భారత జట్టుపై విండీస్ గెలుస్తుందా లేదా అనేది.

తుది జట్ల వివరాలు:
భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె(వైస్‌ కెప్టెన్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, ఇషాన్‌ కిషన్‌, అక్షర్ పటేల్‌, శ్రీకర్‌ భరత్( వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్, జయ్‌దేవ్‌ ఉనద్కత్, నవ్‌దీప్ సైని, ముఖేశ్‌ కుమార్‌.

వెస్టిండీస్: క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌ (వైస్‌ కెప్టెన్‌), అలిక్‌ అథనేజ్‌, త్యాగ్‌నారాయణ్‌ చంద్రపాల్‌, రఖీమ్‌ కార్న్‌వాల్‌, జోష్వా ద సిల్వా, షనోన్‌ గాబ్రియల్‌, జేసన్‌ హోల్డర్‌, అల్జారి జోసెఫ్‌, కిర్క్‌ మెకంజీ, రేమన్‌ రీఫర్‌, కీమర్‌ రోచ్‌, జోమెల్‌ వారికన్‌