మనకు అసలైన నూతన సంవత్సరం ఉగాది రోజు నుంచి ప్రారంభమవుతుంది. హిందూ పంచాంగానికి అనుగుణంగా ఉగాది కొత్త సంవత్సరం మొదటి రోజు. ఆ కారణంగా హిందువులు ఉగాది పండుగను కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఉగాది పచ్చడితో పండుగను జరుపుకుంటారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా ప్రాంతాలలో ఉగాది పండుగ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. అయితే.. చాంద్రమాన క్యాలెండర్‌లోని చైత్రమాసపు మొదటి రోజును ఉగాదిగా జరుపుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ఈ పండుగ వస్తుంది. ఈ సంవత్సరం మార్చి 30, ఆదివారం వచ్చింది. అయితే.. ఈ కొత్త ఏడాదిని “విశ్వావసు నామ సంవత్సరం”గా పిలుస్తాం.
ఉగాది అంటేనే మనకు గుర్తుకు వచ్చేది పచ్చడి. ఉగాది పచ్చడిలోని ఆరు రుచుల్ని మన జీవితంలోని వివిధ భావోద్వేగాలతో పోల్చుతుంటారు. తీపి (బెల్లం), చేదు (వేప పువ్వు), వగరు (మామిడి పిందె), కారం (కారం), ఉప్పు (ఉప్పు), పులుపు (చింత పండు).. వంటి షడ్రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. అయితే.. ఈ పచ్చడి సుఖదుఃఖాలను సమానంగా తీసుకోవాలని అన్యాపదేశంగా సూచించే ఇది కాలాలకు అనుగుణంగా ఆరోగ్య సంరక్షణకూ తోడ్పడుతుంది. వసంతకాలంలో ఒకింత తగ్గే బలం పుంజుకునేలా, జబ్బులను ఎదుర్కొనేలా శరీరాన్ని తీర్చిదిద్దుతుంది. ఉగాది పండుగ నాడు సంప్రదాయంగా పచ్చడిని తింటుంటాం గానీ దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదనే చెప్పుకోవాలి. ఇందులో వాడే దినుసులన్నీ ఔషధ గుణాలతో నిండినవే మరి. పండుగ నాడే కాదు నిత్య జీవితంలోనూ వాడుకునే తీరును అవగతం చేసుకుందాం.
ముందు రుతువులో చివరి 7 రోజులు, తర్వాతి రుతువులో తొలి 7 రోజులను రుతు సంధి అంటారు. ఈ సమయంలో ఆహార, విహార మార్పులతో ఆయా రుతువుల ప్రభావాలను తట్టుకునేలా శరీరాన్ని సన్నద్ధం చేయాలనీ ఆయుర్వేదం సూచిస్తుంది. ఆహారంలో షడ్రుచులూ ఉండేలా చూసుకుంటే బలం పుంజుకుంటుంది. ఇక్కడే ఉగాది పచ్చడి ప్రాధాన్యం సంతరించుకుంటోంది. మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ రసాలతో కూడిన ఇది శరీరం బలంగా, మనసు ఉల్లాసంగా ఉండటానికి తోడ్పడుతుంది.
పచ్చడిలో వాడే ఆరు రకాల పదార్థాల వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.. వేప పువ్వులు, పండ్లు పొట్ట ఉబ్బరం, మొలల వ్యాధిని తగ్గిస్తాయి. పువ్వును కాసేపు వేడి నీటిలో వేసి, వడగట్టి తాగితే నులి పురుగులు పోతాయి. జ్వరం వచ్చే ముందో, తగ్గాకో.. లేదూ ఎక్కడికైనా వెళ్లి వచ్చాక వికారంగా, రుచి తగ్గినట్టు అనిపిస్తే పచ్చిమామిడిని తింటే నోటి హితవు కలుగుతుంది. చింతపండు, మిరియాలు కలిపి తీసుకుంటే అలర్జీలు, జలుబు వంటి కఫ వ్యాధులు తగ్గుతాయి. చింతపండు రసంలో కొద్దిగా నెయ్యి కలిపి తీసుకుంటే మోకాళ్ల నొప్పుల వంటి వాత వ్యాధులు ఉపశమిస్తాయి. పేను కొరుకుడు గలవారు మిరియాలను అరగదీసి గానీ మిరియాల పొడికి కాస్త వేడి నీళ్లు కలిపి గంధంలా చేసి గానీ రాస్తే ఉపశమనం లభిస్తుంది. లవణాల్లో సైంధవ లవణం ఉత్తమమైందని శాస్త్రం చెబుతోంది. వైద్యంలో దీన్నే వాడు తుంటారు. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వారికిది మేలు చేస్తుంది. నిజానికి చెరుకును పళ్లతో నమిలి తినటం శ్రేష్టమని శాస్త్రం పేర్కొంటుంది. ఇది శృంగార సామర్థ్యం ఇనుమడించటానికి తోడ్పడుతుంది. అయితే చెరుకు గడ అడుగు భాగం నులి పురుగులకు దారితీస్తుంది. కణుపులతో పాటు తీసిన రసం మోకాళ్ల నొప్పులను పెంచుతుంది. నిమ్మకాయ, అల్లం రసం కలిపితే కొంతవరకు ఈ చెడు గుణం తగ్గించుకోవచ్చు.