హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి మరో వారం రోజులే మిగిలాయి. దాంతో క్యాంపెయిన్ తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్స్ ఒక్కొక్కరుగా రంగంలో దిగుతున్నారు. అధికార పార్టీ నెల క్రితమే మంత్రి హరీష్ రావును రంగంలో దించింది. మరో రెండు ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలను ప్రచారంలోకి దించాయి.
టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కేసీఆర్‌కు ప్రతిష్టకు సవాలుగా మారింది. గెల్లును గెలిపించే బాధ్యతను మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. దాంతో హరీష్ అండ్ కో.. ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన టీఆర్‌ఎస్ ప్రచారంతో పోల్చి చూసినపుడు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారం ఆ స్థాయిలో లేదనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ బల్మూర్ వెంకట్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించటంలో ఆలస్యం చేసింది. దాంతో హస్తం పార్టీ ప్రచారం కూడా ఆలస్యంగా ప్రారంభమైంది.
గెల్లు గెలుపు కోసం హరీష్ రావు బృందం గట్టిగా కృషి చేస్తోంది. ఈ నెల 26 లేదా 27 న కేసీఆర్ బహిరంగ సభకోసం క్యాడర్ సన్నద్ధమవుతోంది. కేసీఆర్ సభ ప్రతిపక్షాలకు ఫైనల్ పంచ్ వంటిదని విశ్లేషకులు అంటున్నారు. అలాగే ప్రచారానికి దూరంగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు కేసీఆర్ సభలో ప్రధాన పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.
మరోవైపు, బీజేపీ కూడా తమ అగ్ర నేతల సుడిగాలి పర్యటనల షెడ్యూల్ ఫిక్స్ చేసింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీ విజయశాంతి మాజీ మంత్రి డీకే అరుణ ఈ నెల 21 నుంచి విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించనున్నారు. ఇక కాంగ్రెస్ తరపున పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చివరి మూడు రోజులు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఇంఛార్జీల నేతృత్వంలో హస్తం పార్టీ శ్రేణులు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులలో తెలంగాణ ఇంఛార్జ్ మాణికం టాగోర్, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు బల్మూరి వెంకట్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. పథకాలతో పాటు యువకులకు ఉద్యోగాలు కూడా ముఖ్యమని ప్రజలకు వివరిస్తున్నారు. ఉపాధికి అధిక ప్రాధాన్యం ఇస్తామని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
మరోవైపు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన ఇంటింటికి వెళ్లి ఓటడుతున్నారు. మహిళలు ఆయనకు విశేషంగా మద్దతు పలుకుతున్నారు. తిలకం దిద్ది హారతులు పడుతున్నారు. నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలు ఈటలకు తెలుసు. వారిని పేరు పెట్టి పిలుస్తూ ముందుకు సాగుతున్నారు. రెండు చేతులు జోడించి ఓటు అడుగుతున్నారు. ఈటల రాజేందర్‌కు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఆయన గెలుపు తథ్యమనే భావన కలుగుతోంది. ఐతే, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ప్రచారంలో కూడా మనం ఇలాంటి దృశ్యాలను చూడొచ్చు.
ఇక ఈ ఎన్నికలలో మరో కీలక పాత్రదారులు కొత్త ఓటర్లు, బ్యాలెట్ ఓట్లు. ఎన్నికల ఫలితంపై వీరు గొప్ప ప్రభావం చూపనున్నారు. ప్రస్తుతం గులాబీ, కమలం పార్టీలు రెండూ కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. దాదాపు పది వేల మంది తొలిసారి ఓటు వేయబోతున్నారు. వీరు ఎవరి వైపు ఉంటారన్నది ఆసక్తిని కలిగిస్తోంది. అలాగే పోస్టల్ బ్యాలెట్లు కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. కోవిడ్ 19 పేషెంట్లతో పాటు వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే వీలు కల్పించింది. వీరు వేల సంఖ్యలో ఉంటారని అంచనా. ఇప్పటి వరకు 800 మందికి పైగా పోస్టల్ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.
హుజురాబాద్ బరిలో మూడు ప్రధాన పార్టీలు రంగంలో ఉండటంతో ముక్కోణ పోటీ నెలకొంది.బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్యనే ప్రధాన పోటీ. కాంగ్రెస్‌కు గెలుపు ఆశలు లేవు. కానీ తన సత్తా ఏమిటో చూపించాలనుకుంటోంది. ఐతే ఆ పార్టీకి వచ్చే ఓట్లు ఎవరి గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతాయో తెలియదు. ఏదేమైనా, హుజురాబాద్‌లో ఎవరు గెలిచినా చాలా తక్కువ ఓట్ల తేడాతో గెలుస్తారు. అందులో సందేహం లేదు. ఈ స్థితిలో ఓటింగ్ శాతం ప్రధానం. పార్టీల ఆందోళన కూడా ఇదే.
హుజురాబాద్ బరిలో వందలాది మంది ఉంటారని బావించారు. కానీ చివరకు 30 మంది మిగిలారు. ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు వేయటంలో విఫలం కావటం టీఆర్‌ఎస్, బీజేపీకి పెద్ద రిలీఫ్.
Read: చైనాలో కొత్త చట్టం: పిల్లలు తప్పుచేస్తే… తల్లిదండ్రులకు శిక్ష…