హుజురాబాద్ లో కారు దూసుకెళ్తుందా…? కమలం వికసిస్తుందా.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. మరోసారి గెల్చి సిట్టింగ్ సీటు దక్కించుకుంటామని అధికార పార్టీ చెబుతుంటే.. ఈటల గెలుపు పక్కా అనే ధీమాతో ఉంది కమలం పార్టీ. అయితే ఇరుపార్టీలు భారీగా డబ్బులు పంచినా.. తమ ఓట్లు తమకే పడ్డాయని కాంగ్రెస్ చెబుతోంది.బీజేపీ, trs మధ్య హోరా హోరీగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం మరి కొన్ని గంటల్లో వెలువడనుంది. 5 నెలల పాటు ఇరుపార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. ఓటరు తమవైపు ఉన్నాడంటే, తమవైపు ఉన్నాడంటూ ఊదరగొట్టాయి.
ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు వెలువడనుంది. మరోవైపు..సామాజిక సమీకరణాలపై అంచనాకు వచ్చిన టిఆర్ఎస్ …సోషల్ ఇంజనీరింగ్ పై నజర్ పెట్టింది. పోలింగ్ ముగిసిన తర్వాత టిఆర్ఎస్ క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హుజురాబాద్‌లో గెలుపు తమదేనని టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయ్. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలేరు, నారాయణ ఖేడ్, హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరిగాయ్. దుబ్బాక మినహా అన్ని చోట్ల గులాబీ పార్టీనే విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో తమకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని …హుజురాబాద్‌లోనూ తమదే గెలుపంటున్నారు నేతలు. ఈ ఫలితాల పై బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది.
పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని కమలనాథులు విశ్వాస్వం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు సైతం తమకే అనుకూలంగా ఉన్నాయంటున్నారు. అధికార trs పార్టీ… ఈ ఎన్నికలో గెలవడానికి ఎన్ని విధాలుగ ప్రయత్నించాలో అన్ని విధాలుగా ట్రై చేసిందని… అయినe ప్రజలు తమ వైపే నిలిచారని ఆ పార్టీ నేతలు అంటున్నారు… 30 వేలకు పైగా మెజారిటీ ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ.. డబ్బు, మద్యం పంపిణీ చేసి గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నించాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ నిలిచే ఉందని చెబుతోంది. ప్రధానంగా ఇరుపార్టీల మీద ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయని.. భవిష్యత్ కాంగ్రెస్‌దే అంటున్నారు ఆపార్టీ నేతలు.