మహానగరంలో మాయగాళ్లకు కొదవేలేదు అంటుంటారు. ఎందుకంటే.. రోజురోజుకు భాగ్యనగరంలో కొత్తకొత్త రూపాల్లో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి. అందులో అక్రమ నిర్మాణాలు కూడా ఒకటి. అయితే హైదరాబాద్‌లో నకిలీ ధృవప్రతాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై హెచ్‌ఎండీఏ ప్రత్యేక దృష్టి సారించింది. హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ కట్టడాల పై కొరడా ఝుళిపించేందుకు అధికార యంత్రాగాన్ని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 30 లోపు అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేయాలని హెచ్‌ఎండీఏ పరిధిలోని మునిసిపల్ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా కమిషనర్ లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, ఎక్కడ అయితే నిర్మాణాలు జరుగుతున్నాయో వాటికి పర్మిషన్స్ ఉన్నాయో లేవో పరిశీలించాలని సూచించింది. డిసెంబర్ 30 తరవాత అక్రమ కట్టడాలు ఉంటే కమిషనర్లదే బాధ్యతని వారిపైనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.. పురపాలక శాఖ డైరెక్టర్ ఈ అంశం ని మానిటర్ చేయాలని ఉత్తర్వుల్లో హెచ్‌ఎండీఏ పేర్కొంది.