తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇక, హైదరాబాద్ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. ఓవైపు జంట జలశాయాలు నిండు కుండల్లా మరడంతో.. గేట్లను ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాలో ఇళ్లలోకి నీరు చేరి పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఇక, వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడనుందని హెచ్చరించింది వాతావరణశాఖ.. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. ఇక, ఉదయం నుంచి కురుస్తున్న సాధారణ వర్షం ఇలాగే మరో 8 గంటల పాటు కురిసే అవకాశముందని తెలింది.. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తం అయిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.. ఏదైనా సహాయం కోసం 040- 2955 5500 నంబర్‌ను సంప్రదించాలని వెల్లడించింది జీహెచ్‌ఎంసీ.
మరోవైపు హైదరాబాద్ లో ఈరోజు, రేపు, ఎల్లుండి రెడ్ అలర్ట్ కొనసాగుతుందని ప్రకటించారు వాతావరణశాఖ అధికారులు.. రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలకు తోడు దట్టంగా క్యూములో నింబస్ మేఘాలు అలుముకున్నాయని.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దాని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.. 16 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.. గ్రేటర్ హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్ ప్రకటించిన హైదరాబాద్ వాతావరణ శాఖ సూచన.. మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగించింది.