పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. కేంద్రమంత్రి లాంటి పదవిలో ఉండి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచిందని తాను నిరూపిస్తానని ఆయన పేర్కొన్నారు. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్, సర్ ఛార్జ్ పేరుతో పెట్రోల్‌పై రూ.22.47ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నులు పెంచిందని హరీష్ రావు ఆరోపించారు. క్రూడాయిల్ ధరలే పెట్రోల్ ధరల పెంపునకు కారణమని కిషన్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారని.. కేంద్రం విధించిన పన్నుల విషయంపై ఎందుకు నోరు విప్పరని ప్రశ్నించారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్‌పై విధించిన పన్ను రూ.10.43 మాత్రమే అని, ప్రస్తుతం ఆ పన్నులు రూ.32.90 పైసలుగా ఉన్నాయని హరీష్ పేర్కొన్నారు. ఈ ఏడేళ్లలో లీటరు పెట్రోల్‌పై బీజేపీ సర్కారు రూ.22.47 పన్ను పెంచిందన్నారు. అటు లీటరు డీజిల్‌పైనా రూ.27.28 రూపంలో పన్నులు పెంచిందని తెలిపారు.
Read Also: ఏపీలో ఎఫ్‌డీల స్కాం.. ఇద్దరు నిందితుల అరెస్ట్
పెట్రోల్, డీజిల్ ధరల పన్నుల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పుస్తకాలను తాను తీసుకువస్తానని, ఎక్కడికి రావాలో కిషన్ రెడ్డి చెప్పాలని హరీష్ రావు సవాల్ విసిరారు. తాము రూ.200 పింఛన్‌ను రూ.2వేలు చేశామని.. కళ్యాణలక్ష్మీ పథకం కింద ఇచ్చే నగదును రూ.75వేల నుంచి రూ.లక్షకు పెంచామని, రైతు బంధు కింద ఎకరానికి రూ.4వేలు ఇచ్చే నగదును రూ.5వేలకు పెంచామని హరీష్ రావు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు అడ్డగోలుగా రేట్లు పెంచి ప్రజలను అష్టకష్టాలకు గురిచేస్తోందని హరీష్ విమర్శలు చేశారు.