నృత్య తారలు సైతం తెలుగు చిత్రసీమలో రాజ్యమేలిన రోజులు ఉన్నాయి. వారిలో సూపర్ స్టార్ ఎవరంటే విజయలలిత అనే చెప్పాలి. వందలాది చిత్రాలలో ఐటమ్ గాళ్ గా చిందులేసి కనువిందు చేసిన విజయలలిత, కొన్ని చిత్రాలలో వ్యాంప్ గానూ, కీలక పాత్రల్లోనూ మురిపించారు. మరికొన్ని సినిమాల్లో నాయికగానూ నటించారు. యాక్షన్ క్వీన్ గానూ ఇంకొన్ని చిత్రాల్లో సందడి చేశారు. ఆ రోజుల్లో అలా సాగిన నృత్యతార మరొకరు కానరారు. కొందరు విజయలలిత బాటలో పయనించాలని చూసిన ఐటమ్ గాల్స్ ఉన్నారు. అయితే వారెవరూ విజయలలితలాగా సక్సెస్ ను చూడలేదు.
ఆరంభంలో అనేక చిత్రాలలో ఐటమ్ గాళ్ గానే సందడి చేశారు విజయలలిత. అప్పట్లో విజయలలిత నర్తనం తెలుగు సినిమాకు ఓ ఎస్సెట్ గా సాగింది. విజయలలిత సాంగ్ ఉందంటే చాలు, రసికులు థియేటర్లకు పరుగులు తీసేవారు. యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలోనూ విజయలలిత ఐటమ్ గాళ్ గానే కాకుండా కీలక పాత్రల్లోనూ అలరించారు. ఆ సీనియర్ హీరోస్ నుండి కృషి, పట్టుదల, క్రమశిక్షణ అలవరచుకున్న విజయలలిత, వారిలాగే ఏడు గంటల కాల్ షీట్ అంటే ఆరున్నరకే సెట్ లో ఉండేవారు. ఆమెలోని ఈ గుణాన్ని మెచ్చిన యన్టీఆర్, తన పలు చిత్రాలలో విజయలలితకు కీలక పాత్రలనే ఇప్పించారు. మరింత విశేషమేమంటే యన్టీఆర్ సొంత చిత్రం ‘వేములవాడ భీమకవి’లో ఆయన సరసన విజయలలిత నాయికగానూ నటించారు. శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, రామకృష్ణ, చలం వంటి హీరోలకు జోడీగా నటించీ కనువిందు చేశారు. కొన్ని చిత్రాలలో వ్యాంప్ గానూ నటించి మెప్పించారు. ఇక యాక్షన్ మూవీస్ లో తడాఖా చూపిస్తూ, ఫైట్స్ చేసి మురిపించారు. విజయలలిత హీరోయిన్ గా రూపొందిన “రౌడీ రాణి, రివాల్వర్ రాణి, కొరడారాణి, ఒకనారి- వంద తుపాకులు” వంటి యాక్షన్ మూవీస్ జనాన్ని ఆకట్టుకున్నాయి.
యన్టీఆర్ 200వ చిత్రం ‘కోడలు దిద్దిన కాపురం’లో వ్యాంప్ గా నటించారు విజయలలిత. ఆ సినిమా విడుదలైన రోజునే ఆమె నాయికగా రూపొందిన ‘రౌడీ రాణి’ కూడా విడుదలై విజయం సాధించడం అప్పట్లో విశేషంగా చర్చించుకున్నారు. తెలుగులో తొలి సినిమా స్కోప్ సినిమా ఏదంటే అందరూ ‘అల్లూరి సీతారామరాజు’ అనే చెబుతారు. కానీ, బ్లాక్ అండ్ వైట్ లో సినిమా స్పోప్ గా రూపొందిన తొలి చిత్రం విజయలలిత నాయికగా నటించిన ‘ఒకనారి వంద తుపాకులు’. తెలుగులోనే కాదు తమిళనాట కూడా విజయలలిత నర్తనం, నటన ఆకట్టుకున్నాయి. హిందీలోనూ విజయలలిత “రాణీ మేరా నామ్, హథ్ కడీ, సాధూ ఔర్ సైతాన్” వంటి చిత్రాలలో నటించారు. తరువాతి రోజుల్లో పలు చిత్రాలలో లేడీ విలన్ గానూ విజయలలిత మెప్పించారు. ‘సింధూరపువ్వు’లోనూ, ‘సాహసవీరుడు- సాగరకన్య’లోనూ విజయలలిత విలక్షణమైన పాత్రల్లో ఆకట్టుకున్నారు.
విజయలలిత అక్క కూతురే తరువాతి రోజుల్లో లేడీ సూపర్ స్టార్ గా నిలచిన విజయశాంతి. ఈమె కూడా పిన్నికి తగ్గట్టుగానే యాక్షన్ క్వీన్ గా కొన్ని చిత్రాలలో ఫైట్స్ తో మురిపించిన విషయాన్ని ఎవరూ మరచిపోలేరు.