మన ‘కోకిలమ్మ’ ఎస్పీ శైలజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(అక్టోబర్ 9న ఎస్పీ శైలజ పుట్టినరోజు)
ఒక కొమ్మకు పూచిన పూలు దాదాపు ఒకేలా ఉన్నట్టే శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి సంతానంలో ఆయనలాగే ఇద్దరికి గానం ప్రాణమయింది. వారే ప్రఖ్యాత గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఆయన చెల్లెలు ఎస్.పి.శైలజ. తండ్రి సాంబమూర్తి హరికథ చెప్పడంలో మేటి అనిపించుకుంటే, ఆయన పిల్లలు చిత్రసీమలో తమ గాత్రంతో జైత్రయాత్ర చేశారు. బాలు చెల్లెలు అన్న గుర్తింపుతోనే సినిమా రంగంలో అడుగు పెట్టినా, తన గళ విన్యాసాలతో శైలజ సైతం జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు. గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా, టీవీ షోస్ లో న్యాయనిర్ణేతగా, నటిగా శైలజ బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. నటిగా శైలజ కనిపించిన ఏకైక చిత్రం ‘సాగరసంగమం’. అందులో ఆమె పాత్ర పేరు కూడా శైలజనే. ఇప్పటికీ ఎస్పీ శైలజ అనగానే అభిమానులు ఆ సినిమానే గుర్తు చేసుకుంటారు.
శైలజ 1962 అక్టోబర్ 9న నెల్లూరులో జన్మించారు. ఎస్పీ సాంబమూర్తి ఎనిమిది మంది సంతానంలో అందరికంటే చిన్నవారు శైలజ. బాలు గాయకునిగా పేరు సంపాదించడంతో వారి కుటుంబంలోని కొందరు ఆయన నీడన చేరారు. అలా శైలజ కూడా అన్న దగ్గర చేరుకున్నారు. ఈ కుటుంబానికి ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ బంధువు. దాంతో శైలజలోని గాత్రాన్ని పసికట్టి ఆయన ముందుగా ఆమెను డబ్బింగ్ కళాకారిణిగా పరిచయం చేశారు. విశ్వనాథ్ తెరకెక్కించిన ‘సీతామాలక్ష్మి’లో నాయిక తాళ్లూరి రామేశ్వరికి తొలిసారి డబ్బింగ్ చెప్పారు శైలజ. ఆ తరువాత నటిగానూ విశ్వనాథ్ ‘సాగరసంగమం’లో పరిచయం చేశారు. అప్పటికే నృత్యంలో శిక్షణ పొందడంతో ఆ సినిమాలో అతి సులువుగా తన పాత్రలో ఒదిగిపోయారు శైలజ. ఆ చిత్ర ఘనవిజయం తరువాత శైలజకు నటిగా అనేక అవకాశాలు పలకరించాయి. అయితే ఆమె అభినయానికి దూరంగానే జరిగారు. మాదాల రంగారావు నిర్మించి, నటించిన ‘ఎర్రమల్లెలు’లో ఆయన తనయుడు మాస్టర్ రవికి “నాంపల్లి స్టేషన్ కాడి…రాజాలింగో…” పాట పాడి యావత్ తెలుగునేలనూ పులకింప చేశారు శైలజ. అప్పటి నుంచీ శైలజ గళంలో జాలువారిన అనేక పాటలు జనాన్ని అలరిస్తూనే ఉన్నాయి.
Also Read
శైలజ నోట పలికిన పాటలు అనేకం ఈ నాటికీ వీనులవిందు చేస్తున్నాయి. ఇక ఆమె నోటి మాటలు సైతం అనేకమంది తారల నటనకు ప్రాణం పోశాయి. శ్రీదేవి ఇతర భాషల్లో నటించిన చిత్రాలు తెలుగులో అనువాదమైనప్పుడు ఆమె పాత్రకు శైలజ చెప్పిన డబ్బింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. అచ్చు శ్రీదేవిలాగే తన గళాన్ని సవరించుకొని గమ్మత్తు చేశారు శైలజ. ఇక రాధిక, టబు, హీరా, శరణ్య, సాక్షి శివానంద్, సోనాలీ బింద్రే, రవీనా టాండన్ వంటి అనేకమంది పరభాషా నాయికలు తెలుగులో శైలజ మాటతోనే సాగారు. “సరిగమలు, సూపర్ సింగర్, సరిగమప” వంటి కార్యక్రమాల్లో శైలజ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాటకు, మాటకు న్యాయంచేస్తూనే సాగుతున్నారు శైలజ.
నటుడు శుభలేఖ సుధాకర్ ను వివాహమాడిన శైలజకు ఓ బాబు. పేరు శ్రీకర్. సుధాకర్, శైలజ సంసార నౌక హాయిగా సాగుతోంది. శైలజ మరిన్ని వసంతాలు చూస్తూ మరింతగా జనాన్ని ఆకట్టుకుంటారని ఆశిద్దాం.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!