టీఆర్ఎస్ నేత, మాజీ పీసీసీ చీఫ్ డీ. శ్రీనివాస్… కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. చాలా కాలంగా టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న డీఎస్.. కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే… డీఎస్ రాకపై నిజామాబాద్ జిల్లా తో పాటు..రాష్ట్రంలోని సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ దగ్గర అభ్యంతరం వ్యక్తం చేయడంతో డీఎస్ కి క్లియరెన్స్ రాలేదు. అప్పట్లో డీఎస్ చేరిక అలా వాయిదా పడింది.ప్రస్తుతం సోనియా గాంధీ పార్టీ బాధ్యతలు చూస్తుండడంతో , ds మరోసారి తన ప్రయత్నాలు సాగించారు. గతంలో పార్టీలో సోనియా గాంధీకి ఉన్న సన్నిహితుల్లో డీఎస్ కూడా ఒకరు కావడంతో…మేడంని కలిసి మనసులో మాట చెప్పడం, ఆమె ఓకే చెప్పేయడం తో పార్టీలో చేరికకు క్లియరెన్స్ వచ్చినట్టు అయ్యింది.
డీఎస్ పార్టీలో చేరే అంశాన్ని, సోనియా గాంధీ ..పార్టీ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న కేసీ వేణుగోపాల్ కి సమాచారం ఇవ్వడంతో, అయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి టాగూర్ కి తెలిపారు. ఈ అంశం పై పార్టీ చీఫ్ రేవంత్, సిఎల్పీ నేత భట్టి లకు కబురు పంపారు. ఉదయం ఏఐసీసీ కి రావాలని పిలిచారు. పార్లమెంట్ నడుస్తున్న నేపద్యంలో సభ విరామ సమయంలో పార్టీ నాయకులను సోనియా లేదంటే రాహుల్ గాంధీలు కలిసే అవకాశం ఉంది.
అయితే డీఎస్ చేరికపై రాష్ట్ర నాయకుల తో మాట్లాడి… డీఎస్ కి కాంగ్రెస్ కండువా కప్పనున్నట్లు సమాచారం. అయితే నిజామాబాద్ జిల్లా కు చెందిన కొందరు నాయకులు డీఎస్ చేరికపై కొంత అసంతృప్తి తో ఉన్నారు. ఇదే అంశాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి టాగూర్ కి విన్నవించారు. అయితే డీఎస్ చేరిక అంశం సోనియా గాంధీ నిర్ణయం కాబట్టి దీనిపై పెద్దగా వివాదం ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి డీఎస్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. దీంతో అసంతృప్త నేతలు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.