పెట్రో ధరలు దేశవ్యాప్తంగా సామాన్యులకు భారంగా మారిపోయాయి.. క్రమంగా ఆ ధరల ప్రభావం అన్ని వస్తువులపై పడుతూనే ఉంది.. అయితే, పెట్రోల్, డీజిల్‌లపై దిగుమతి సుంకాలను తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇదే సమయంలో.. ఏడేళ్ల క్రితం అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలను కృత్రిమంగా తగ్గించేందుకు కేంద్ర చమురు సంస్థలకు కాంగ్రెస్ పాలిత యూపీఏ ప్రభుత్వం బాండ్లను జారీ చేసిందని ఆరోపించిన ఆమె.. సదరు ఆయిల్ బాండ్లపై ఇప్పటికీ తమ ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందని చెప్పుకొచ్చారు.
ఇక, గత ఐదేళ్ల కాలంలో ఆయిల్ బాండ్లపై ఎన్డీఏ సర్కార్ రూ.60 వేల కోట్ల వడ్డీ చెల్లించినట్లు తెలిపిన నిర్మలా సీతారామన్… ఇంకా రూ.1.3 లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయని వెల్లడించాఉ.. యూపీఏ హయాంలో రూ.1.44 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్ల జారీ చేయడంతో అప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయని.. కానీ, ఆయిల్ బాండ్ల భారం మా ప్రభుత్వంపై పడిందని.. వాటి కారణంగానే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేకపోతున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటే తప్ప పరిష్కార మార్గం లేదని.. ఇప్పటికైతే పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించే సమస్యే లేదు స్పష్టం చేశారు.