మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో 15 నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనకు నేటితో ముగుస్తోంది. పోరుబాటను వీడి పొలం బాట పట్టనున్నారు రైతులు. ఢిల్లీలోని సింఘు, తిక్రీ ఘాజీపూర్ సరిహద్దుల్లో గుడారాల్లో ఉంటూ ఆందోళన చేసిన రైతులు పంజాబ్, హర్యానాలోని తమ తమ గ్రామాలకు విజయ యాత్రతో తిరిగి వెళ్తున్నారు. ట్రాక్టర్లపై ఇళ్ళకు వెళ్తున్న రైతులకు స్వాగతం పలికేందుకు హైవేల వెంబడి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.
విజయయాత్ర ను ముందుగా నిన్ననే నిర్వహించాలని భావించినా…తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా, 13 మంది మరణించిన నేపథ్యంలో అది నేటికి వాయిదా పడింది. పెద్ద సంఖ్యలో రైతులు సరిహద్దు ప్రాంతాలను ఖాళీ చేయనున్నారు. దీంతో ఇంతకాలంగా ఏర్పడిన ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
నేటి విజయోత్సవ సమావేశంలో, ఉద్యమం సందర్భంగా మృతిచెందిన 700 రైతులకు నివాళులు అర్పిస్తామన్నారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్. తమ ఉద్యమానికి ఇతోధికంగా సాయం చేసిన వ్యక్తులను కలుస్తామన్నారు. కొంతమంది రైతులు ఇప్పటికే ధర్నా స్థలాలను ఖాళీ చేయడం ప్రారంభించారని, దీనికి 4-5 రోజులు పడుతుందన్నారు. తాను డిసెంబరు 15న ధర్నా ప్రదేశం నుంచి బయలుదేరుతానన్నారు రాకేష్ టికాయత్.