వ్యవసాయ చట్టాలపై అలుపెరుగని పోరాటం చేసిన రైతులు తాత్కాలికంగా తమ పోరాటానికి విరామం ప్రకటించారు. ఇవాళ ఉదయం నుండి ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్నారు రైతులు. శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సొంత రాష్ట్రాలకు ప్రయాణం అవనున్నారు రైతులు. మూడు నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో సరిహద్దులు ఖాళీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
ఢిల్లీ సరిహద్దులు సింగూ ,టిక్రి ,గజీపూర్ లలో సంవత్సరంపైగా(378 రోజులు) ఆందోళన చేపట్టారు రైతులు. సంయుక్త కిసాన్ మోర్చా ,భారతీయ కిసాన్ సంఘ పేరుతో దేశ వ్యాప్తంగా ఉన్న పలు రైతు సంఘాలు మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబర్ నుంచి పోరుబాట ప్రారంభించాయి. జోరు వాన,తీవ్రమైన చలి ,ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ఉక్కు సంకల్పంతో ఎన్డీఏ సర్కార్ పై ఒత్తిడి పెంచారు రైతులు.
ఎట్టకేలకు దిగివచ్చిన మోడీ సర్కారు… మూడు వ్యవసాయ చట్టాలను రద్దుకు నిర్ణయం… రైతు సంఘాల డిమాండ్లపై సానుకూల హామీ లేఖ ఇచ్చింది. స్వాత్రంత్య భారత దేశ చరిత్రలో అతి సుదీర్ఘమైన రైతు పోరాటంగా రికార్డు సాధించింది. పోరాటంలో కన్నుమూసిన 7 వందల మందికి పైగా రైతుల త్యాగాలు నిరుపమానం. వారి ఆత్మకు శాంతి కలగాలని అంతా కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ హామీలపై జనవరి 15న సమీక్షకు రైతు సంఘాల భేటీ జరగనుంది.