కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది.. ఇప్పటికే భారత్‌లోనూ ఈ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి.. కరోనాపై విజయం సాధించాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని గుర్తించిన భారత్.. విస్తృస్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది.. రికార్డు స్థాయిలో 125 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసింది.. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోనివారు వెంటనే తీసుకోవాలని సూచిస్తోంది. మరోవైపు కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ కోసం ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం.. దీనికోసం ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో వ్యాక్సినేషన్ ప్యానెల్ సమావేశం కానుంది.. ఈ సమావేశంలో బూస్టర్ డోస్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Read Also: ఒమిక్రాన్ టెన్షన్.. ఫిబ్రవరిలో తీవ్రరూపం..!
అయితే, ప్రభుత్వం బూస్టర్ డోస్‌ను తన దృష్టిలో పెట్టుకోలేదు, ఎందుకంటే అర్హులందరికీ వీలైనంత వేగంగా రెండు డోసుల టీకాలు వేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది.. కానీ, సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు టెన్షన్ పెడుతుతోన్న నేపథ్యంలో.. కోవిడ్-19 ఇమ్యునైజేషన్‌పై భారతదేశ నిపుణుల ప్యానెల్ ఇవాళ సమావేశం అవుతోంది.. బూస్టర్ డోసు వేస్తే ఎలా ఉంటుంది? వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా సాగుతోంది.. ఈ ప్రక్రియ దశలవారీగా ఎలా అమలు చేయాలి, బూస్టర్ డోసు ఇస్తే.. అధిక ప్రమాదం ఉన్నవారికి ప్రాధాన్యత ఇద్దామా? లేదా అందరికీ ఇవ్వాలా? తదితర అంశాలపై చర్చించి ఓ నిర్ణయానికి రానుంది. అంతేకాదు.. 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌పై కూడా చర్చించనున్నారు.. ప్యానెల్ సభ్యుల మధ్య పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించడంపై ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ, దశలవారీగా కసరత్తు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యాక్సిన్‌కు ఏ పిల్లలు మొదట అర్హులో అనే విషయం తేల్చడంపై ప్రస్తుతం దృష్టి సారించారు నిపుణులు. పిల్లలకు టీకాలు వేయాలనే నిర్ణయం తొందరపడి తీసుకోబోమని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. మొత్తంగా ఇవాళ ఢిల్లీలో జరిగే వ్యాక్సినేషన్ ప్యానెల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.