(జూన్ 5న ‘ఏక్ దూజే కే లియే’ కు 40 ఏళ్ళు)
తెలుగులో ఘనవిజయం సాధించిన చిత్రాలు హిందీలో రీమేక్ అయి అక్కడా విజయకేతనం ఎగురవేసిన సందర్భాలు బోలెడున్నాయి. వాటిలో ఇక్కడా అక్కడా మ్యూజికల్ హిట్స్ గా నిలచినవీ ఉన్నాయి. అందునా విషాదాంత ప్రేమకథలు కూడా కొన్ని చోటు చేసుకోవడం విశేషం. అలాంటి వాటిలో మేటిగా నిలచింది ‘ఏక్ దూజే కే లియే’. కె.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, సరిత జంటగా రూపొంది ఘనవిజయం సాధించిన ‘మరోచరిత్ర’ ఆధారంగా ఈ హిందీ చిత్రం రూపొందింది. దీనిని నిర్మించింది మేటి దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్. ఈ సినిమాకు ముందు కూడా ఎల్వీ ప్రసాద్ అనేక తెలుగు చిత్రాలను హిందీలో రీమేక్ చేసి విజయాలను సాధించారు. తెలుగులో జయకేతనం ఎగరేసిన ‘మూగమనసులు’ చిత్రాన్ని ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలోనే ‘మిలన్’గా రీమేక్ చేసి హిట్ కొట్టారు ఎల్వీ ప్రసాద్. అదీగాక ‘మరో చరిత్ర’ చిత్రాన్ని తమిళ దర్శకుడు, తమిళ నిర్మాత, తమిళ హీరో కలసి తెలుగులోనే రూపొందించడం విశేషం కాగా, ఈ తెలుగు చిత్రం మద్రాసులో 75 వారాలు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. అందువల్ల ఎల్.వి.ప్రసాద్ దృష్టిని ఈ సినిమా భలేగా ఆకర్షించింది. ‘మరో చరిత్ర’ను చూడగానే ప్రసాద్ కు దీనిని హిందీలో రీమేక్ చేయాలన్న ఆలోచన కలిగింది. అలా ‘ఏక్ దూజే కే లియే’ రూపొందింది. 1981 జూన్ 5న ‘ఏక్ దూజే కే లియే’ జనంముందు నిలచి జయకేతనం ఎగురవేసింది.
అదే కథ…
‘మరో చరిత్ర’ కథ తెలుగువారికి తెలియనిది కాదు. బాలు, స్వప్న ప్రేమించుకుంటారు. వారిపెద్దలు వేర్వేరు భాషలవారు కావడంతో వారి ప్రేమను అంగీకరించరు. ఓ మధ్యవర్తి వచ్చి ఓ యేడాదిపాటు మీరు అసలు మాట్లాడుకోకుండా ఉంటే మీ ప్రేమగొప్పదని అంగీకరించి, మీ పెద్దలు పెళ్ళి చేస్తారని చెబుతాడు. దానికి బాలు, స్వప్న కూడా అంగీకరించేలా చేస్తారు. బాలు వేరే ఊరు వెళ్ళడం, అక్కడ సంధ్య అనే అమ్మాయితో స్నేహం ఏర్పడటం జరుగుతుంది. ఓ సారి స్వప్నను తన బావతో చూసిన బాలు, ఆమె మారిపోయిందని భావించి, సంధ్యని పెళ్ళాడతానంటాడు. విధవ అయిన తన చెల్లి బ్రతుకు బాగు పడుతుందని ఆమె అన్న సంతోషిస్తాడు. అయితే బాలు స్వప్న ప్రేమ గురించి తెలుసుకున్న సంధ్య వారి ఊరెళ్ళి స్వప్నను కలుసుకుంటుంది. అసలు విషయం తెలుసుకొని, బాలును స్వప్న అతని కోసం ఎంతలా ఎదురుచూస్తోందో చెబుతుంది. బాలు వెళ్ళిపోయాడని తెలుసుకున్న సంధ్య అన్న అతణ్ణి చంపమని రౌడీలను పురమాయిస్తాడు. అక్కడ స్వప్నను ఓ దుర్మార్గుడు మానభంగం చేస్తాడు. అదే సమయంలో బాలును రౌడీలు కత్తులతో పొడుస్తారు. స్వప్న, బాలు ఇద్దరూ ఒకటిగా ఈ లోకం వీడిపోవడం ‘మరోచరిత్ర’ కథ. ఇదే కథను యథాతథంగా హిందీ జనానికి నచ్చేలా బాలచందర్ మలిచారు. హిందీలో హీరో పేరు వాసుగా మార్చారు.
ఈ చిత్ర కథ స్ఫూర్తితో తరువాతి రోజుల్లో పలు సినిమాలు తెరకెక్కడం విశేషం.
భలే భలేగా…
కె.బాలచందర్ దర్శకత్వంలో ‘ఏక్ దూజే కే లియే’ కంటే ముందు ‘ఆయినా’ అనే హిందీ చిత్రం రూపొందింది. అయితే ఈ సినిమా తరువాత బాలచందర్ సినిమాలకు సైతం ఉత్తరాదిన మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో వరుసగా తన దర్శకత్వంలో రూపొందిన తమిళ హిట్స్ ను హిందీలో రీమేక్ చేసి ఆకట్టుకున్నారు బాలచందర్. ఇక కమల్ హాసన్ కు , ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఇదే తొలి హిందీ చిత్రం. తెలుగులో సంధ్యగా నటించిన మాధవి హిందీలోనూ అదే పాత్రను పోషించారు. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం సమకూర్చారు. ఆరంభంలో ఎస్పీ బాలు గళాన్ని వారు వద్దనుకున్నారు. అయితే బాలచందర్, “ఇందులో హీరో సౌత్ ఇండియన్ కాబట్టి, అతని గొంతుకు తగ్గట్టుగా బాలునే పాడగలడు” అని వారిని ఒప్పించారు. చిత్రంగా బాలు పాడిన పాటలు ఉత్తరాది వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో అనేక హిందీ చిత్రాలలో బాలు పాట మారుమోగింది. ఈ తొలి చిత్రంతోనే ఉత్తమ గాయకునిగా నేషనల్ అవార్డును అందుకున్నారు బాలు. ఈ సినిమాకు 13 ఫిలిమ్ ఫేర్ నామినేషన్స్ లభించగా, మూడు అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ స్క్రీన్ ప్లేకు కె.బాలచందర్ కు, బెస్ట్ లిరిసిస్ట్ గా ఆనంద బక్షికి, బెస్ట్ ఎడిటర్ గా ఎన్.ఆర్. కిటూ ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.
హిందీ బాట పట్టడానికి…
ఈ చిత్రానికంటే ముందే రతి అగ్నిహోత్రి తెలుగులో “పున్నమినాగు, అందాలరాశి, ప్రేమసింహాసనం” వంటి చిత్రాలలో నటించింది. ‘ఏక్ దూజే కే లియే’ ఘనవిజయంతో రతి అగ్నిహోత్రి ఉత్తరాదిన కూడా మంచి పేరు సంపాదించగలిగారు. ‘ఏక్ దూజే కే లియే’ ఘనవిజయంతో కమల్ హాసన్ కు హిందీ చిత్రాలలోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. అదే సమయంలోనే అందాల తార సారికతో కమల్ కు ప్రేమబంధం ఏర్పడి, వారిద్దరూ జీవనయానం సాగించారు. మాధవికి కూడా బాలీవుడ్ లో ఓ గుర్తింపు లభించి, కొన్ని హిందీ చిత్రాలలో నటించడానికి ఈ సినిమాయే కారణమయింది.
మరపురాని గీతాలు…
‘మరోచరిత్ర’ తెలుగు చిత్రానికి ఎమ్.ఎస్.విశ్వనాథన్ సంగీతం సమకూర్చగా, ఆచార్య ఆత్రేయ పాటలు రాశారు. “భలే భలే మగాడివోయ్…” పాటలో ఇంగ్లిష్ లైన్స్ ను మాత్రం రాండర్ గై పలికించారు. ఇక హిందీలో లక్ష్మీకాంత్-ప్యారేలాల్ స్వరాలకు అనువుగా ఆనంద్ బక్షి పదరచన చేసి ఆకట్టుకున్నారు. తెలుగులో ఆరు పాటలూ విశేషాదరణ పొందాయి. అలాగే హిందీలోనూ ఆరు పాటలూ అలరించాయి. “తేరే మేరే బీచ్ మే…” (రెండు వర్షన్స్), “హమ్ తుమ్ దోనో జబ్ మిల్ జాయేంగీ…”, “హమ్ బనే తుమ్ బనే ఏక్ దూజే కే లియే…”, “మేరే జీవన్ సాథీ… ప్యార్ కియే జా…”, “సోలా బరస్ కీ బాలీ ఉమర్…” పాటలు సంగీతాభిమానుల మదిని దోచాయి. విదేశీయులను సైతం ఆకట్టుకున్నాయి. ఎంతలా అంటే, ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తన ‘టాక్సిక్’ సాంగ్ లో ‘హుక్’లాగా ఇందులోని “తేరే మేరే బీచ్ మే…” లైన్స్ ను ఉపయోగించుకొనేంతగా!