తమిళనాడులో మరో మాజీ మంత్రిపై అవినీతి నిరోధకశాఖ దాడులు చేస్తోంది.. తమిళనాడు మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఇంటిపై డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్ అధికారులు.. ఇవాళ ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు.. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, దింగిల్ సహా మొత్తం 54 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.. ఇప్పటికే కొన్ని కీలమైన డాక్యుమెంట్లు , కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు సీజ్ చేసినట్టుగా చెబుతున్నారు.. అన్నా డీఎంకే ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా పనిచేసినా వేలుమణిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
వివిధ పథకాల కింద అమలు చేయాల్సిన పనుల్లో వేలుమణి రూ.1,500 కోట్ల అవినీతికి పాల్పడినట్లు కోయంబత్తూరు ఆర్థిక నేర విభాగం పోలీసులకు గతంలోనే ఫిర్యాదులు అందాయి.. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కోవై కార్పొరేషన్‌తో పాటు పక్కనున్న మున్సిపాలిటీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, కొందరు శాసనసభ్యులు కలిసి ప్రజాధనాన్ని స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.. కోయంబత్తూరు కార్పొరేషన్‌లో రూ.1,500 కోట్లతో చేపట్టిన అవినాశీ–అత్తికడవు పథకానికి తొలివిడతగా రూ.225 కోట్లు మంజూరయ్యాయి. నొయ్యాల్ చెరువు స్వాధీనం కోసం రూ.230 కోట్లు, కోవై నగరానికి 24 గంటల తాగునీటి సరఫరాకు రూ.550 కోట్లు, కునియముత్తూరు భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.19.5 కోట్లు, ఆత్తుపాలం–ఉక్కడం ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు రూ.215.51 కోటి, కోవై రేస్‌కోర్సు స్మార్ట్ సిటీ పథకానికి తొలివిడతగా రూ.40 కోట్లు కేటాయింపు జరిగింది.. ఇలా కోవైలో జరిగే అన్ని పనులకు మంత్రి తన వాటాగా 12 శాతం కమీషన్ తీసుకున్నారి.. ఇలా వివిధ పథకాల ముసుగులో రూ.1,500 కోట్ల వరకు మాజీ మంత్రి వేలుమణి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో.. ఇప్పుడు అవనితీ నిరోధకశాఖ రంగంలోకి దిగింది.