బహిరంగ ప్రదేశాలలో నమాజ్ అంశం కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ప్లేస్‌లో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను సహించేది లేదన్న హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటన వివాదాస్పదమైంది. గురుగ్రామ్‌లో ముస్లింలకు గతంలో కేటాయించిన ప్రార్థనా ప్రదేశాలన్నిటిని హర్యానా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. నిర్దేశిత ప్రదేశాలలో ముస్లింలు ప్రార్థనలు చేయటాన్ని ఆర్‌ఎస్‌ఎస్ సహ హిందూ సంస్థల కార్యకర్తలు అడ్డుకోవటం ఈ నిర్ణయానికి దారితీసింది. ఐతే, ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఖట్టర్ నిర్ణయంపై ముస్లిం నేతలు మండిపడుతున్నారు.
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఖట్టర్ తీరును తీవ్రంగా నిరసించారు. ఇలాంటి భారత్‌లో కశ్మీర్ విలీనం కాదన్నారాయన. ఈ నిబంధనలు అన్ని మతాలపై పెడితే బాగుంటుందని అన్నారు. మజ్లిస్ చీప్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఘాటుగా స్పందించారు. ఆయా ప్రదేశాలలో నమాజ్ చేసుకోవచ్చని 2018లో రాతపూర్వకంగా అనుమతించిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు. గుర్గావ్‌లో శుక్రవారం నమాజ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ముస్లింల పట్ల ద్వేషం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. వారానికి ఒకసారి 15, 20 నిమిషాల పాటు చేసే జుమా నమాజ్ ఎవరినైనా ఎలా బాధపెడుతుంది అని గతంలోనే ప్రశ్నించారు.
బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసమే ఇటువంటి చర్యలకు దిగుతోందనే విమర్శలు వస్తున్నాయి. అంతకు ముందు ,గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అహ్మదాబాద్ రోడ్ల పక్కన మాంసహార విక్రయాల నిషేదం కూడా తీవ్ర వివాదస్పదమైంది. ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు కూడా వేసింది. మాసం ఇష్టం లేకపోతే తినకండి. అది మీ సమస్య. మేం బయటికి వచ్చి ఏం తినాలని మాకు మీరు చెప్తారా? ఇలాగే పోనిస్తే.. రేపు ఆరోగ్యం పాడవుతుంది కాఫీ కూడా తాగొద్దు అని చెప్పరని గ్యారెంటీ ఏంటి? అని న్యాయస్థానం ప్రశ్నించటం ప్రజలను ఆలోచింపచేస్తోంది. ఇక ఇప్పుడు, ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేతల ప్రసంగాలలో మతం తప్ప ఇంకేమీ లేదు.
ఇప్పుడు, ఇతర మతస్తులు ఏం చేసినా అది సమాజానికి ముప్పు అని ప్రచారం చేస్తున్నారు. గురుగ్రామ్ నిరసనలు అందుకు ఓ ఉదాహరణ. వీహెచ్‌పీ నాయకుడు ఒకరు ముస్లింలు చేసేది నమాజ్ కాదు, జిహాద్, ఇది ఉగ్రవాదం అంటున్న వీడియెను వారే సామాజిక మాద్యమాలలో షేర్ చేశారు. ఇది హిందూత్వ శక్తుల ఉద్దేశపూర్వక వ్యూహమని బృందా కరత్ వంటి వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదే సమయంలో విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష నేతలు లక్ష్యంగా విషం చిమ్మతున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీపై అలాంటి దుష్ప్రచారం జరిగింది. రోడ్ల మీద నమాజ్ ని నిషేధిస్తే పార్కులలో యోగాని కూడా నిషేధించాలని ఆమె అన్నారనే వార్త వైరల్ అయింది. ఐతే, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారనటానికి ఎటువంటి ఆధారాలు లేవు.
ఇది ఇలావుంటే, బహిరంగ ప్రదేశాలలో నమాజ్ అంశం బీహార్‌కు కూడా పాకింది. హర్యానా ముఖ్యమంత్రి దారిలోనే బీహార్ సీఎం నడవాలని బీజేపీ నాయకులు అంటున్నారు. బీహార్‌లో కూడా బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ను నిషేధించాలని ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఐతే, ఈ అంశంపై సీఎం నితీష్ కుమార్ ఘాటుగాస్పందించారు. దీనిని ఓ చిల్లర పంచాయితీగా ఆయన కొట్టిపారేశారు. ఎవరి ఇష్టం వారిది ..కొందరు బహిరంగంగా ప్రార్థిస్తారు, కొందరుఎ బహిరంగంగా పాడుకుంటారు మీకేంటి కష్టం అన్నట్టు మాట్లాడారు నితీష్. అందరూ తమకు సమానమే , వారు వీరు అని తేడా లేకుండా అందరితో కలిసి నడుస్తామని జనతా దర్బార్ సందర్భంగా నితీష్ కుమార్ బీజేపీ నేతలకు పరోక్షంగా చెప్పాల్సింది చెప్పారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించాల్సి వుంది.
బీహార్ శాసనసభలో నితిష్ కుమార్ బలం బీజేపీ కన్నా చాలా తక్కువ. ఐనా, ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆయనకు సీఎం పదవి ఆఫర్ చేసింది. దాంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఐతే, అధిష్టానాన్ని ప్రశ్నించే సాహసం చేయలేరు. ఈ నేపథ్యంలో నమాజ్ అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఇదంతా హైకమాండ్ డైరెక్షన్‌లో చేస్తున్నారా అనేది తెలియాల్సి వుంది.
మరోవైపు, కోవిడ్ విషయంలో కూడా మోడీ సర్కార్‌కు షాకిచ్చారు నితీష్ కుమార్. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులు పాత వేరియంట్‌కు చెందినవా లేక ఓమిక్రాన్ కు చెందినవా అని తేల్చటంలో కేంద్ర ప్రభుత్వ అసమర్థతను ఆయన ఎత్తి చూపారు. శాంపిల్స్ పంపించి రోజులు గడుస్తున్నా రిపోర్టుల అతిగతీ లేకపోవటంపై ఆయన తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారు. దాంతో రాష్ట్రంలోని ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ -ఎన్‌సీడీసీ కి పంపుతున్నారు.
మరవైపు, ప్రత్యేక హోదా అంశాన్ని బీహార్ సీఎం మరోసారి తెరమీదకు తెచ్చారు. నీతి ఆయోగ్ నివేదిక అభివృద్ధి సూచీలలో బీహార్ అట్టడుగున నిలిచింది. ఈ సందర్భాన్ని నితీష్ సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా అవసరాన్ని ఇది తెలియజేస్తోందని మోడీ ప్రభుత్వానికి గుర్తుచేశారు. బీహార్ స్పెషల్ కేటగిరీ కోసం 2004 నుంచి ఆయన కేంద్రంతో కొట్లాడుతున్నారు.
ప్రత్యేక హోదా అంశం గతంలో నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చేతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ అధికారం కేంద్రానికి బదిలీ అయింది. గతంలో వెనకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ఈశాన్య రాష్ట్రాలకు, మరో మూడు కొండ ప్రాంత రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. ఐనా, పట్టువదలని విక్రమార్కుడిలా నితీష్ కుమార్ ఈ డిమాండ్‌ను వదలకుండా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన డిప్యూటీ సీఎం రేణు దేవీ తమకు స్పెషల్ స్టేటస్ అవసరం లేదని వ్యాఖ్యనించటం నితీష్‌ను ఇబ్బందికి గురిచేసింది. దాంతో ఆయన పరోక్షంగా ఆమెపై ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా బీహార్‌కు చాలా అవసరమని, అలా కాదని ఎవరైనా చెబితే, వారికి సమస్య గురించి తెలియదని అర్థమని అన్నారు. బీహార్ గురించి వారికి ఏమీ తెలియదని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. బీహార్ డిప్యూటీ సీఎం రేణు దేవి బీజేపీకి చెందిన వారు.
ఇదంతా చూస్తుంటే నితీష్ కుమార్ ఇటు రాష్ట్ర బీజేపీపై, అటు కేంద్ర ప్రభుత్వం మీద దాడి ప్రారంభించారని స్పష్టంగా అర్థమవుతోంది. 243 సభ్యుల బీహార్ అసెంబ్లీలో బీజేపీ బలం 74 కాగా, నితీష్ జేడీయూ బల్ 45 మాత్రమే. మరోవైపు, ప్రతిపక్ష ఆర్జేడీ 75 మంది శాసన సభ్యులతో అతి పెద్ద పార్టీగా కొనసాగుతుందో. ఈ పరిస్థితిలో నితిష్ కుమార్ బీజేపీపై దాడికి దిగటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలు బీహార్ రాజకీయాలను ఎటువైపు తీసుకువెళతాయో వేచి చూడాలి.