శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. టాలీవుడ్ సినిమా ఈవెంట్లు హైదరాబాద్ తరువాత వరంగల్‌లో ఎక్కువగా జరుగుతున్నాయని, ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతోనే వరంగల్‌లో ఈవెంట్లు నిర్వహించగలుగుతున్నామని దిల్ రాజు అన్నారు. వరంగల్‌లో ఎంసీఏ సినిమా షూటింగ్, ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించామని, ఆ సినిమా మంచి విజయం సాధించిందని, ఇప్పుడు అదే వరంగల్‌లో శ్యామ్ సింగరాయ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామని, ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని దిల్ రాజు అన్నారు.
Read: ముందు పుష్ప… వెనుక ఆర్ఆర్ఆర్… తగ్గేదిలేదంటున్న నాని…
నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24 వ తేదీన దక్షిణాది అన్ని భాషల్లో రిలీజ్ కాబోతున్నది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌తో 1970 కాలం నాటి కథతో సినిమాను తెరకెక్కించారు. అప్పటి కాలానికి అనుగుణంగా సెట్స్ వేసి సినిమాను చిత్రీకరించారు. సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్ హీరోయన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకున్నది.