భారతదేశంలో కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో చేప కింద నీరులా విజృంభిస్తోంది. దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు నాలుగు నెలల్లో అత్యధికంగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 800 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 841 కేసులు నమోదుకాగా.. 5,389 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు ఒక్కో మరణాన్ని నమోదు చేయగా, కేరళలో ఇద్దరి మహమ్మారికి బలైయ్యారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 4.46 కోట్లకు చేరింది.
Also Read: Google employees: గూగుల్ సీఈఓ పిచాయ్‌కి ఉద్యోగుల లేఖ
కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో అత్యధికంగా వైరల్ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. రోజువారీ కేసులు నెలలో ఆరు రెట్లు పెరిగాయి. ఒక నెల క్రితం (ఫిబ్రవరి 18) సగటు రోజువారీ కొత్త కేసులు 112 కాగా, ఇప్పుడు (మార్చి 18) 626కి పెరిగింది. యాక్టివ్ కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.01 శాతం ఉన్నాయి. COVID-19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,58,161కి పెరిగింది.కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 220.64 కోట్ల డోస్‌ల COVID-19 వ్యాక్సిన్ ఇవ్వబడింది. కాగా, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 5 లక్షల 30 వేల 799 మంది కరోనాతో మరణించారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ కు పదవి నుంచి బర్తరఫ్ చేయాలి.. రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపు
మరోవైపు ఆకస్మికంగా కరోనా కేసులు పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. పెరుగుతున్న వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించడంపై దృష్టి పెట్టాలని కేంద్రం ఆరు రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు లేఖ రాశారు. పరీక్షలు, చికిత్స, ట్రాకింగ్, టీకాలు వేయడం లాంటి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ టెస్ట్ పాజిటివిటీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయని ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ శనివారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.