దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది కుటుంబాల్లో విషాదం నెలకొంది. చాలామంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. మరికొందరు కుటుంబసభ్యులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు కనీస నష్టపరిహారం చెల్లించాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రతి కరోనా మరణానికి రూ.50వేల పరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Read Also: మరో రికార్డు సొంతం చేసుకున్న ప్రధాని మోదీ
ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. మీ సేవా కేంద్రాల ద్వారా మొదటి రోజే 500కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి కోవిడ్ డెత్ సర్టిఫికేట్లను జారీ చేయనుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
కరోనాతో చనిపోయిన వారి కుటుంబసభ్యులు పంచాయతీ లేదా మున్సిపాలిటీ అధికారుల నుంచి డెత్ సర్టిఫికేట్, కోవిడ్ పాజిటివ్ రిపోర్టును దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ రిపోర్టు లేకపోతే.. వైరస్ కారణంగా అడ్మిట్ అయిన ఆసుపత్రి నుంచి మరణాన్ని ధృవపరిచే మెడికల్ సర్టిఫికెట్ జత చేయాలి. ఇది కూడా లేకపోతే… కరోనా చికిత్సలో చేసిన పరీక్షల బిల్లులు, ఇతరత్రా పేపర్లు సమర్పించాలి. బ్యాంకు అకౌంట్, ధృవపత్రాలతో రూ. 50 వేల పరిహారం కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాలి.