దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా టూరిస్ట్ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు గోవా వెళ్లారు. నూతన సంవత్సర వేడుకల తరువాత ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక, కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ముంబై పోర్ట్ నుంచి గోవాకు కార్డెలియా క్రూజ్ షిప్ వెళ్లింది. అయితే, 2000 మంది టూరిస్టులతో బయలుదేరిన ఈ షిప్‌లో కరోనా కలకలం రేగింది.
Read: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ప్రయాణికుల్లో 66 మందికి కరోనా సోకింది. దీంతో షిప్పును గోవా తీరంలో నిలిపివేశారు. షిప్పులోని ప్రయాణికులకు కరోనా సోకిన విషయాన్ని ముంబై పోర్టుకు, కార్డెలియా క్రూజ్ యాజమాన్యానికి తెలియజేశామని, ప్రయాణికులందరికీ టెస్టులు చేస్తున్నామని గోవా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. షిప్పులోని ప్రయాణికులకు ప్రస్తుతం బయటకు అనుమతించడం లేదు. ప్రయాణికులు ఎప్పుడు బయటకు రావాలన్నది అధికారులే నిర్ణయం తీసుకుంటారని గోవా ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.