వందేళ్ళ చరిత్ర ఉన్న ధర్మాసుపత్రి విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి. బ్రిటీష్ కాలంలో నిర్మితమై…ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ సేవలతో విస్తరించింది. లక్షల మందికి వైద్యసేవలు అందిస్తున్న ఆ ఆసుపత్రి చుట్టూ ఇప్పుడు రాజకీయం మొదలైంది. శతాబ్ధ కాలం క్రితం పెట్టిన పేరును మార్చాలనే పొలిటికల్ డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయిని. పేరుకి ధర్మాసుపత్రే కానీ కార్పొరేట్ స్ధాయి వైద్యం అందుతుంది. ఇటీవల కాలంలో KGH సేవలు ఛత్తీస్ ఘడ్, ఒడిషా రాష్ట్రాలకు విస్తరించాయి. ఆంధ్రామెడికల్ కాలేజ్ అనుబంధంగా పనిచేస్తున్నఆసుపత్రుల్లో అత్యంత ముఖ్యమైంది KGH. ఏటా ఇక్కడ వైద్యసేవలు పొందేవారి సంఖ్య లక్షల్లో వుం టుంది. కోవిడ్ తర్వాత ఈ ఆసుపత్రి ఖ్యాతి మరింత పెరిగింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రభుత్వ దవాఖానా చుట్టూ ఇప్పుడు రాజకీయం రాజుకుంది.
కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరును మార్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే గుంటూరు జిన్నాటవర్ పంచాయతీ నడుస్తుండగా…ఇప్పుడు కేజీహెచ్ పేరు అంశం హాట్ టాపిక్ గా మా రింది. బ్రిటీష్ పరిపాలకుడు కింగ్ జార్జ్ స్ధానంలో ఉత్తరాంధ్రలో పోరాట యోధుల పేర్లను పెట్టాలనేది ఆయన డిమాండ్. వీర్రాజు కామెంట్ల పై ఘాటుగా స్పందించారు పురపాలకశాఖ మంత్రి బొత్స.
ఇప్పటి విశాఖ మహానగరం 1845లో కాలంలో చిన్న మత్స్యకార గ్రామం. ఇక్కడ ప్రజలకు అవసరమైన వైద్యసేవల కోసం సివిల్ డిస్పెన్సరీని ప్రారంభించింది బ్రిటీష్ ప్రభుత్వం. ఆ తర్వాత విద్య,వైద్యసేవలు విస్తరించగా… 1923లో ఆంధ్రా మెడికల్ కళాశాల ఏర్పాటైంది. డిస్పెన్సరీని ఎ.ఎమ్.సి.కి అనుసంధానించి ఆసుపత్రిగా విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో కింగ్ జార్జ్-5 ఇండియాకు రావడంతో ఆయన గౌరవార్ధం ఆసుపత్రికి నామకరణం చేశారు. ఇది వందేళ్ళ క్రితం నాటి మాట.
తొలి ప్రిన్సిపల్ గా లెఫ్టెనెంట్ ఎఫ్.జె.ఆండ్రసన్ పనిచేయగా ..దాదాపు స్వాతంత్య్రం వచ్చే వరకు బ్రిటీష్ మిలట్రీ అధికారులే ఇక్కడ విధులు నిర్వహించారు. ఆ తర్వాత కేజీహెచ్ మరింత ప్రగతి సాధించింది. దశల వారీగా విస్తరించి ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ వైద్యసేవలు అందించేస్ధాయికి చేరింది. ఇటువంటి నేపథ్యం కలిగి, ప్రజాబాహుళ్యంకు సుపరిచితమైన పేరు మార్చాలనే డిమాండ్ వెనుక రాజకీయ దురుద్దేశం తప్ప బీజేపీకి మరో ఆలోచన లేదంటు న్నాయి రాజకీయపార్టీలు.
కింగ్ జార్జ్ పేరు మార్పు డిమాండ్ ను ఉత్తరాంధ్ర బీజేపీ నాయకత్వం బాహాటంగా సమర్ధించుకోలేని పరిస్ధితి. ఈ ప్రాంతంలో మారుమూలకు వెళ్ళినా కేజీహెచ్ పేరు సుపరిచితం. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, ప్రత్యేక ప్యాకేజ్, రైల్వేజోన్ వంటి అంశాల గురించి మాట్లాడకుండా కేజీహెచ్ పేరును వివాదాస్పదం చేయడం రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేస్తున్నదేననే విమర్శలు వున్నాయి.