కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు సమయం దొరికినప్పుడల్లా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపైనా, ఆర్ఎస్ఎస్ పైనా నిప్పులు చెరుగుతుంటారు. వారి మతరాజకీయాలపై విమర్శలు చేస్తుంటారు. అయితే, సడెన్‌గా దిగ్విజయ్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపైనా, ఆర్ఎస్ఎస్‌పైనా ప్రశంసలు కురిపించారు. గతంలో వారు చేసిన సాయం గురించి మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్ల క్రితం తాము నర్మదా పరిక్రమ యాత్రను చేస్తున్న సమయంలో అమిత్ షా, ఆర్ఎస్ఎస్‌లు గొప్ప సాయం చేశారని అన్నారు. ఈ యాత్ర సమయంలో ఓరోజు రాత్రి 10 గంటల సమయంలో ఓ అటవీ ప్రాంతానికి చేరుకున్నామని, అది గుజరాత్‌కు సమీపంలో ఉన్నామని, రాత్రి సమయం కావడంతో ముందుకు వెళ్లలేకపోయామని, ఏం చేయాలో, ఎటు వైపు వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో ఉండగా, సడెన్‌గా తమ వద్దకు ఓ ఫారెస్ట్ అధికారి వచ్చారని, తమకు పూర్తిగా సహకరించాలని అమిత్ షా ఆదేశించారని ఆ ఫారెస్ట్ అధికారి చెప్పినట్టు దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆ పార్టీపైనా, అమిత్ షాపైనా ఎన్నో విమర్శలు చేశానని, అయినప్పటికీ, తీర్థయాత్ర సమయంలో తాము ఎలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి షా తమకు సహాయం చేశారని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. అలానే భరూచ్ ప్రాంతం గుండా యాత్ర వెళ్తున్న సమయంలో తమ బృందానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మాంఝీ ఆశ్రమంలో విడిది ఏర్పాటు చేశారని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. రాజకీయాలు వేరు, మతాలు వేరు అనే విషయం అందరూ తెలుసుకోవాలని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
Read: భవానీపూర్ ఉప ఎన్నికల్లో టెన్షన్…బీజేపీ, టీఎంసీ మధ్య ఘర్షణ…