త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ గా ఈ ఎన్నికలను అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోని అధికార, విపక్ష పార్టీలన్నీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ తమ సీఎం అభ్యర్థులను సైతం మార్చివేసి తగ్గేదేలే అని చాటిచెబుతోంది. ఇదే ఫార్మూలాను తాజాగా కాంగ్రెస్ సైతం అవలంభిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో మున్ముందు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో మార్చి నాటికి అసెంబ్లీ గడువు ముగియనుంది. ఒక్క ఉత్తరప్రదేశ్లో మాత్రం మేలో చివరినాటికి ముగియనుంది. ఈ ఐదింటిలో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంగా ఉండగా కాంగ్రెస్ ఒక రాష్ట్రంలో అధికారంలోకి ఉంది. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లో బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ పంజాబ్ లో అధికారాన్ని కాపాడుకోవాల్సిన అవశ్యతక నెలకొంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ లో ఇటీవల ముఖ్యమంత్రిని మార్చడం వెనుక పెద్దవ్యూహామే ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్ ను సింగ్ ను అధిష్టానం తప్పించింది. ఆయన స్థానంలో ఎస్సీ వర్గానికి చెందిన చరణ్ జీత్ సింగ్ చన్నీకి ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించింది. పంజాబ్ రాష్ట్రం తమ చేతుల నుంచి జారిపోకుండా ఉండాలనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యర్థులకు షాకిచ్చినట్లే కన్పిస్తుంది.
ఎన్నికల ముందు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని మార్చడం తప్పా? ఒప్పా అన్న సంగతి పక్కకు పెడితే దీని వెనుక పెద్ద వ్యూహామే ఉన్నట్లు అర్థమవుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా నియమితులైన తొలి దళిత నేత చన్నీయే. అంటే ఇప్పటివరకు అగ్రవర్ణ నేతలే సీఎంలుగా ఉన్నారని స్పష్టమవుతోంది. పంజాబ్ లో దళిత ఓటర్లు 32శాతం ఉన్నారు. వీరు ఎటువైపు మొగ్గుచూపితే ఆపార్టీని అధికారంలోకి రావడం ఖాయంగా కన్పిస్తుంది. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలైన శిరోమణి అకాలీదల్, బీజేపీ పార్టీలు సీఎం అభ్యర్థులుగా ఎస్సీలేనని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సైతం అలర్ట్ అయింది.
ఈక్రమంలోనే ఆపార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ ఎస్సీ నేతకే పట్టం కట్టింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి దళితుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న చరణ్ జిత్ చన్నీకి సీఎంగా అవకాశం కల్పించింది. రాబోయే ఎన్నికల్లో దళిత ఓటును బ్యాంకును గంపగుత్తగా కొల్లగొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుగానే పావులు కదిపినట్లు తెలుస్తోంది. తాము చేయాలనుకున్న పనిని ముందుగానే కాంగ్రెస్ పార్టీ చేయడంతో ప్రత్యర్థి పార్టీలకు షాక్ కొట్టినట్లయింది. మొత్తానికి వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ చరణ్ జిత్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లనుంది. దీంతో కాంగ్రెస్ దళిత వ్యూహాం ఆపార్టీకి కలిసి వస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!