హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌కు ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ హోరా హోరీ ప్రచారం నిర్వహించాయి. ప్రచారపర్వం ముగిసిన క్షణం నుంచి ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పుడు నియోజకవర్గంలో ఓటర్ల కొనుగోలు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నట్టు కనబడుతోంది. ఒక్క ఓటుకు వేలల్లో ధర పలుకుతున్నట్టు సమాచారం. పార్టీల నుంచి డబ్బు అందని ఓటర్లు రోడ్డెక్కి ధర్నాలకు దిగటం ఈ ఎన్నికల్లో హైలైట్. ఇలాంటివి గతంలో ఎన్నడూ జరగలేదు. అందుకే దేశం యావత్ దీనిని విడ్డూరంగా చూస్తోంది.
మరోవైపు, తమ పేరు ప్రతిష్టకు భంగంకలిగించి, విజయావకాశాలను దెబ్బతీసేందుకు తప్పుడు వార్తలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఈసీకి పిర్యాదు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ తమ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగటాన్ని అడ్డుకుంటున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఎన్నికలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ గురువారం ఢిల్లీలోని ఈసీఐ కార్యాలయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేను కలిసి ఈ మేరకు లేఖ సమర్పించారు.
బీజేపీ, టీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డాయని, ఒక్కో ఓటుకు ఆరు వేల నుంచి పది వేల రూపాయల ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ తన లేఖలో పేర్కొంది. హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయ వ్యభిచారంగా మారిందని శ్రవణ్ విమర్శించారు. పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ కూడా గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని శశాంక్‌గోయల్‌ను కలిసి భాజపా, తెరాసల అక్రమాలపై ఫిర్యాదు చేశారు.
మూడు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి అనేక మంది పెద్ద నాయకులు గత ఐదు నెలల్లో హుజూరాబాద్‌లో క్యాంపు వేసి ప్రచారం చేశారు. ఇది సుదీర్ఘ ఎన్నికల ప్రచారాలలో ఒకటిగా నిలిచింది. పురుష ఓటర్లను ఆకర్షించేందుకు రెండు అధికార పార్టీల ఉచితంగా మద్యం పంపిణీ చేస్తున్నారు. ఇది కుటుంబాలలో చిచ్చుకు కారణమవుతోంది. ఇన్ని అక్రమాలు, గందరగోళం జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
నియోజకవర్గంలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక పోలీసుల సహకారంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు గ్రామాలు, పట్టణాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని బీజేపీ ఆరోపించింది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రైవేట్ ఆస్పత్రి అంబులెన్స్‌ల ద్వారా డబ్బులు పంపిస్తున్నారని..స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని సీఈసీ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనుప్ చంద్ర పాండే, తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌లకు లేఖ రాస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ అధికారులకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు కాక్‌టెయిల్ పార్టీ ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు.
మరోవైపు, ఓ మహిళ బిజెపి ఎన్నికల గుర్తుతో పాటు అభ్యర్థి రాజేందర్ ఫొటో ఉన్న కవరును అందుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కవరు లోపల ఐదు రెండు వేల కరెన్సీ నోట్లు ఉన్నాయి. ఇలాంటి అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతున్నాయి. ఈ వీడియోలకు సంబంధించి విచారణకు ఆదేశించాలని ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల కమిషన్‌కు రాసిన మరో లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇది భారతీయ జనతా పార్టీని పేరు ప్రతిష్టను దెబ్బతీస్తున్న దీనిపై సీరియస్‌గా దర్యాప్తు చేయాలని కోరారు. అటువంటి వీడియోలను సర్క్యులేట్ చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అలాంటి వీడియోలను సృష్టించి, వాటిని సర్క్యులేట్ చేసే వ్యక్తులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ తన కంప్లెయింట్‌లో పేర్కొంది.
ఆర్థిక మంత్రి టి హరీష్‌రావు , బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నారని ప్రైవేట్ ఛానెల్ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని, సదరు న్యూస్ చానెల్‌పై చర్యలు తీసుకోవాలని టీఆరెస్ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వార్తల క్లిప్పింగ్ ఉద్దేశపూర్వకంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అవకాశాలను దెబ్బతీస్తుందని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాసరెడ్డి తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
ఇదిలావుంటే, నకిలీ లేఖకు సంబంధించిన ఫిర్యాదుల్లో ఒకదానిపై చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది. హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం అమలును నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘానికి ఈటల రాజేందర్ రాసిన లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఐతే ఆ అది నకిలీ లెటర్ అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
మొత్తానికి హుజురాబాద్ ఉప పోరులో నగదు ప్రవాహాన్ని యావత్ దేశం చూసింది. దీనిని అత్యంత ఖరీదైన ఎన్నికగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. డబ్బు పంపకాల వీడియోలు చూసిన వారికి ఇది నిజమే అనిపిస్తుంది. తనను అధికారాన్ని ప్రశ్నించిన ఈటల రాజకీయ భవిష్యత్ ను ప్రశ్నార్థకం చెయ్యటమే గులాబీ పార్టీ బాస్ టార్గెట్. ఫలితంగా హుజురాబాద్ లో వందల కోట్ల నిధులు తరలివెళ్లాయి. ఇదే ఛాన్సని ఓటర్లు నోట్ల పండగ చేసుకుంటున్నారు.
మాజీ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తన కుటుంబానికి చెందిన కంపెనీపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మే 1న ఆయనను ఉన్నట్టుండి క్యాబినెట్ నుండి తొలగించారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో జూన్ 4న ఆయన టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2003 నుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగి, నాలుగు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన రాజేందర్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలోఉన్నారు. ఈటల రాజేందర్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మధ్య రాజకీయ పోరుగా ఈ ఉప ఎన్నికను భావిస్తున్నారు. చివరకు హుజూరాబాద్ ఓటరు ఎవరిని విజేతగా నిలుపుతాడో చూడాలి!!